కేసీఆర్ నెంబర్ వన్ అవినీతిపరుడు

కేసీఆర్ నెంబర్ వన్ అవినీతిపరుడు

నల్గొండ: సీఎం కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి వివేక్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉండేవారని, అందుకే ఆయన తుగ్లక్లా ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సచివాలయం కూల్చివేత, బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు వంటి నిర్ణయాలు అందుకు సాక్ష్యమని చెప్పారు. కొత్త పార్లమెంట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే... రాష్ట్ర సచివాలయ కోసం కేసీఆర్ రూ.1200 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు.  కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ అవినీతిపరుడని, సచివాలయ నిర్మాణంలో కూడా ఆయన అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. దేశంలో ఏ పార్టీ కూడా ఇప్పటివరకు రూ.100 కోట్లు వెచ్చించి సొంత విమానం కొనుగోలు చేయలేదని, కానీ కేసీఆర్ కు సొంత విమానం కొనుక్కునేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని వివేక్ ప్రశ్నించారు. 

మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. అవినీతి సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేయాలని కేసీఆర్ చూస్తున్నారన్న వివేక్...  కానీ కేసీఆర్ మోసం ప్రజలకు అర్థమైందని చెప్పారు. జాతీయ రాజకీయాల పేరుతో స్కామ్ ల నుంచి తప్పించుకోవాలని కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారని ఆరోపించారు. కానీ తమ వద్ద కేసీఆర్ అవినీతికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని, కేసీఆర్ కు శిక్ష తప్పదని హెచ్చరించారు. మునుగోడులో రోజురోజుకి బీజేపీలోకి వలసలు పెరిగిపోతున్నాయని, అది చూసి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి 15 సీట్లు కూడా రావని వివేక్ వెంకటస్వామి అన్నారు.