బియ్యం ఎగుమతుల్లో ఇండియానే టాప్

బియ్యం ఎగుమతుల్లో ఇండియానే టాప్
  • ఇంటర్నేషనల్​ మార్కెట్​తో నిల్వ సమస్య పరిష్కారం
  • సివిల్​ సప్లయీస్​ కమిషనర్ స్టీఫెన్​ రవీంద్ర

గండిపేట, వెలుగు: బియ్యం ఎగుమతుల్లో ఇండియానే టాప్​లో ఉందని, ప్రపంచం మొత్తంగా 6 కోట్ల మెట్రిక్​ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుండగా, అందులో మన దేశం వాటానే 40 శాతం ఉందని సివిల్​ సప్లయీస్​ కమిషనర్, వ్యవసాయ శాఖ సంచాలకుడు స్టీఫెన్​రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో బియ్యం మిగిలిపోతున్న బియ్యం నిల్వలపై మంగళవారం రాజేంద్రనగర్​లోని అగ్రికల్చర్​ వర్సిటీలో మేథోమధన సదస్సు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పదేళ్లలో బియ్యం ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందన్నారు. ఈ ఏడాది 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తయ్యే అవకాశం ఉందని, రాష్ట్ర అవసరాలకు 50 లక్షల మెట్రిక్ టన్నులు పోతాయన్నారు. మిగిలినవి ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ‘తెలంగాణ రైస్’ అనే  బ్రాండ్ తో ఫిలిప్పైన్స్ కు ఎక్స్​పోర్ట్​ ప్రారంభమైందన్నారు. 

ఇక్కడ ఉత్పత్తవుతున్న బియ్యానికి ఆఫ్రికా దేశాల్లో ఫుల్​ డిమాండ్​ ఉందన్నారు. డిమాండ్ కు మించి ఆహార ఉత్పత్తులు పెరుగుతున్నందున నిల్వల కోసం అంతర్జాతీయ మార్కెట్లను అన్వేషించాల్సిన అవసరం  ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో డాక్టర్ బి.గోపి, పౌర సరఫరాల శాఖ సంచాలకులు హనుమంత్ కొండిబా, అదనపు సంచాలకులు రోహిత్, పీజేటీఏయూ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, పరిశోధన సంచాలకులు డాక్టర్ మరాఠి బలరాం, వరల్డ్ ఫుడ్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత డాక్టర్ సమరేండు మహంతి తదితరులు పాల్గొన్నారు.