మోరంపల్లి బంజరలో.. మోడల్ ఫాంహౌస్..సమీకృత వ్యవసాయ విధానం అమలుకు చర్యలు

మోరంపల్లి బంజరలో.. మోడల్ ఫాంహౌస్..సమీకృత వ్యవసాయ విధానం అమలుకు చర్యలు

 

  • తక్కువ భూమిలో వివిధ రకాల కూరగాయల సాగు 
  • సమీకృత వ్యవసాయంతో సత్ఫలితాలు సాధించవచ్చు 

భద్రాచలం, వెలుగు :  జిల్లాలో సారవంతమైన భూమి, నీరు, ఇతర వనరులున్నా రైతులు కేవలం వరి, పత్తి, మిరప పంటలకే పరిమితమై నష్టాల పాలవుతున్నారు. సమీకృత వ్యవసాయ విధానాన్ని ఆచరిస్తే సత్ఫలితాలు సాధించొచ్చని కలెక్టర్​జితేశ్​ వి.పాటిల్ మోడల్ ఫాంహౌస్​ల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామంలో ప్రభుత్వం భూమిలో మోడల్ ఫాంహౌస్​ను నిర్మిస్తున్నారు. జిల్లాలోని రైతాంగం ఈ ఫాంహౌస్​ను చూసి వారు కూడా సమీకృత వ్యవసాయం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

కూరగాయల సాగుతో...

బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజరలో ఎంపిక చేసిన ఎకరం భూమిలో సమీకృత వ్యవసాయం కోసం ఫాంహౌస్​ను నిర్మిస్తున్నారు. ఈ భూమిని 30 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో ఆరు భాగాలు చేసి.. 20 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో డివైడ్​చేస్తున్నారు. ఆరు భాగాల్లో ఆనపకాయ (సోరకాయ), దొండ, మునగ, కీర దోస, కాకర, బీరకాయల పంటలు సాగు చేస్తారు. 

మిగిలిన మూడు భాగాల్లో కౌజు పిట్టలు, కొర్రమీను చేపలు, బాతుల పెంపకం చేపడతారు. మిగిలిన భూమిలో వెదురు, వక్క సాగుకు ప్లాన్ చేస్తున్నారు. పొలం చుట్టూ బయో ఫెన్సింగ్ నిర్మిస్తారు. ఇందుకు అవసరమయ్యే విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులోకి తెస్తున్నారు. 

ట్రైనింగ్ సెంటర్​గా మోడల్ ఫాం హౌస్..

మోరంపల్లి బంజరలో నిర్మించే మోడల్ ఫాంహౌస్ ట్రైనింగ్ సెంటర్​గా ఉపయోగిస్తారు. ఆధునిక సాంకేతికతతో తక్కువ భూమిలో వివిధ రకాల కూరగాయల సాగు చేసి ఎక్కువ ఆదాయం పొందడం ఎలా.? అనే అంశంపై రైతులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. కలెక్టర్ సూచనలతో జిల్లాలో చాలా చోట్ల రైతులు కౌజు పిట్టల పెంపకం, మునగ పంటలు సాగు చేస్తున్నారు. దీనిపై అవగాహన సాధించాక రైతులంతా తమ గ్రామాల్లో ఈ తరహా మోడల్ ఫాంహౌస్​లను ఏర్పాటు చేసి లాభాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించారు. 

పనులు ప్రారంభించాం 

కలెక్టర్ జితేశ్ వి.పాటిల్​సూచన మేరకు మోరంపల్లి బంజర గ్రామంలో ఎకరం భూమిలో సమీకృత వ్యవసాయం కోసం మోడల్ ఫాం హౌస్ నిర్మాణ పనులు ప్రారంభించాం. కూరగాయలు, పువ్వులు, చేపల పెంపకం ద్వారా లాభాలు సాధించేందుకు ఇది దోహదపడుతుంది. రైతులకు సమీకృత వ్యవసాయం ఎంతో ఉపయోగపడుతుంది. - విజయలక్ష్మి, ఏపీవో, ఈజీఎస్, బూర్గంపాడు