సర్కారు బడులకు తగ్గనున్న కరెంట్ బిల్లుల భారం

సర్కారు బడులకు తగ్గనున్న కరెంట్ బిల్లుల భారం
  • జనరల్ కేటగిరీ నుంచి డొమెస్టిక్​కు మార్చేందుకు చర్యలు 

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడులకు కరెంట్ బిల్లుల భారం తగ్గనుంది. జనరల్ కేటగిరీలో ఉన్న విద్యాలయాలను త్వరలోనే డొమెస్టిక్ కేటగిరీలోకి మార్చనున్నారు. అందుకు అవసరమైన చర్యలను సర్కారు చేపట్టింది. ఇటీవల విద్యాశాఖపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి  రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరెంట్ బిల్లుల భారంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో సర్కారు బడులను సాధ్యమైనంత తక్కువ బిల్లులు వచ్చే కేటగిరీలోకి మార్చాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

దీంతో విద్యుత్ శాఖతో పాటు విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. విద్యా సంస్థలు జనరల్ కేటగిరీలో ఉండటంతో భారీగా బిల్లులు వస్తున్నాయి. ఈ సమస్యను హెడ్మాస్టర్లు, టీచర్లు పలుమార్లు గత సర్కారు దృష్టికి తీసుకుపోయినా.. పట్టించుకోలేదు. దీంతో చాలా సర్కారు బడుల్లో పెండింగ్ బిల్లులు వేలు, లక్షల్లోనే ఉన్నాయి. ఈ విషయం సీఎం రేవంత్ దృష్టికి పోవడంతో స్లాబ్ మార్చాలని అధికారులను ఆదేశించారు.