రికార్డు ర్యాలీ మరునాడు మార్కెట్లు బోల్తా.. ఎందుకిలా జరిగిందంటే..

రికార్డు ర్యాలీ మరునాడు మార్కెట్లు బోల్తా.. ఎందుకిలా జరిగిందంటే..
  • ప్రాఫిట్​ బుకింగ్​తో మార్కెట్లకు దెబ్బ.. సెన్సెక్స్ 1,282 పాయింట్లు డౌన్
  • 1.39 శాతం తగ్గిన నిఫ్టీ

ముంబై: రికార్డు ర్యాలీ మరునాడు మార్కెట్లు బోల్తా పడ్డాయి. ఐటీ, ఆటో,  ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్​ బుకింగ్​ కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ సెన్సెక్స్ 1,282 పాయింట్లు పడిపోయింది. ఇది1.55 శాతం నష్టపోయి 81,148.22 వద్ద స్థిరపడింది. దీనిలోని 25 స్టాక్స్​ నష్టాలతో,  ఐదు లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 1,386.21 పాయింట్లు పడిపోయి 81,043.69కి చేరుకుంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 346.35 పాయింట్లు క్షీణించి 24,578.35 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కంపెనీల నుంచి ఇన్ఫోసిస్ అత్యధికంగా 3.54 శాతం పడింది.

పవర్ గ్రిడ్ 3.4 శాతం, ఎటర్నల్ 3.38 శాతం, హెచ్​సీఎల్​ టెక్ 2.94 శాతం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2.88 శాతం  భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ 2.74 శాతం పడ్డాయి. ఇండస్‌‌‌‌‌‌‌‌ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్​టీపీసీ, మారుతి, టాటా మోటార్స్, ఎం అండ్​ ఎం నష్టపోయాయి. సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  టెక్ మహీంద్రా లాభపడ్డాయి. ప్రాఫిట్​బుకింగ్​వల్ల ఐటీ, ఎఫ్​ఎంసీజీ, ఆటో సెక్టార్లు నష్టపోయాయని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్​ అజిత్ మిశ్రా అన్నారు.  

లాభాల్లో బ్రాడ్​మార్కెట్లు
బీఎస్ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 0.99 శాతం,  మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం పెరగడంతో మంగళవారం బ్రాడ్​ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెక్టోరల్​ ఇండెక్స్​లలో బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ 2.44 శాతం, టెక్ 2.39 శాతం, ఐటీ 2.21 శాతం, యుటిలిటీస్ 1.35 శాతం, విద్యుత్ ఒక శాతం, మెటల్ 0.95 శాతం,  చమురు, గ్యాస్ 0.95 శాతం నష్టపోయాయి. హెల్త్​కేర్​, ఇండస్ట్రియల్స్​, క్యాపిటల్​ గూడ్స్​, సర్వీసెస్​, కన్జూమర్​గూడ్స్​ లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్,  షాంఘై  ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ కాంపోజిట్ ఇండెక్స్ సానుకూలంగా ముగిశాయి. హాంకాంగ్‌‌‌‌‌‌‌‌కు చెందిన హాంగ్ సెంగ్ నష్టపోయింది.

యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. చైనా, యూఎస్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో సోమవారం యూఎస్ మార్కెట్లు బాగా పెరిగాయి. నాస్‌‌‌‌‌‌‌‌డాక్ కాంపోజిట్ 4.35 శాతం, ఎస్ అండ్ పీ 500 3.26 శాతం,  డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 2.81 శాతం దూసుకెళ్లాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 0.32 శాతం పెరిగి బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు  65.17 డాలర్లకు చేరుకుంది. ఎఫ్​ఐఐలు రూ.1,246.48 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.