- 24 వేల పైన నిఫ్టీ.. రూ.6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- రూ.822 కోట్ల విలువైన షేర్లు కొన్న విదేశీ ఇన్వెస్టర్లు
- 40 పైసలు బలపడిన రూపాయి
- అమెరికా-ఇరాన్ మధ్య త్వరలో డీల్ కుదిరే అవకాశం
ముంబై: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగవడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం వంటి సానుకూల పరిణామాలతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ సుమారు 1,074 పాయింట్లు (1.42 శాతం) లాభపడి 76,489 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 312 పాయింట్లు పెరిగి 24,032 వద్ద స్థిరపడింది. మార్కెట్ ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.469 లక్షల కోట్లకు చేరుకుంది.
సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జొమాటో పేరెంట్ కంపెనీ ఎటర్నల్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 2-3 శాతం పెరిగి టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఇన్ఫోసిస్, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా షేర్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. రాబోయే రోజుల్లో మంత్లీ ఎఫ్ అండ్ ఓ (ఎఫ్ అండ్ ఓ ) ఎక్స్‌పైరీ కారణంగా మార్కెట్లలో వోలటాలిటీ ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీ సూచీ పాజిటివ్ ట్రెండ్‌తో 23,500 నుంచి 24,000 పరిధిలో కదలొచ్చని అంచనావేశారు.
మార్కెట్ పెరగడానికి గల కారణాలు.. అమెరికా-ఇరాన్ యుద్ధం ఆగుతుందనే ఆశ..
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మార్గాన్ని తిరిగి తెరిచేలా వాషింగ్టన్, ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రాథమిక చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రతినిధులు ఒక ఒప్పందానికి దగ్గరవుతున్నట్లు వచ్చిన వార్తలు మార్కెట్లో సరికొత్త జోష్ నింపాయి.
100 డాలర్ల దిగువకు క్రూడ్
శాంతి ఒప్పంద వార్తల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ దాదాపు 6శాతం క్షీణించి బ్యారెల్‌కు 98 డాలర్లకు చేరాయి. అమెరికా క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ కూడా 6శాతం తగ్గి 91 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
పుంజుకున్న గ్లోబల్ మార్కెట్లు..
అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల వాతావరణంతో ప్రపంచ మార్కెట్లు కూడా సోమవారం పరుగులు తీశాయి. జపాన్ నిక్కీ సూచీ ఏకంగా 3శాతం పెరిగి చరిత్రలోనే తొలిసారిగా 65 వేల మార్కును దాటింది. చైనా షాంఘై కాంపోజిట్ ఒక శాతం, తైవాన్ వెయిటెడ్ ఇండెక్స్ 3శాతం పైగా లాభపడ్డాయి. అమెరికన్, యూరోపియన్ మార్కెట్లు కూడా గ్రీన్‌లోనే కదిలాయి.
తగ్గిన బాండ్ రాబడులు
గత వారం గరిష్ట స్థాయిలను తాకిన బాండ్ యీల్డ్స్ ఈ వారం ఆరంభంలో తగ్గుముఖం పట్టాయి. యూఎస్ 10-ఇయర్స్ ట్రెజరీ యీల్డ్ 4.558శాతానికి తగ్గింది. బాండ్ యీల్డ్స్ తగ్గడం వల్ల ఈక్విటీ మార్కెట్లకు నిధుల ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది.
రూపాయి జూమ్
ముడి చమురు ధరలు తగ్గడంతో గత వారం ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయిన భారత రూపాయి విలువ సోమవారం కోలుకుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 35 పైసలు పెరిగి 95.25 వద్ద ముగిసింది. శుక్రవారం సెషన్‌లో 95.69 వద్ద సెటిలైంది. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) సోమవారం నికరంగా రూ.822 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
