- రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్రైల్వేస్టేషన్సమీపంలో ఘటన
షాద్‌నగర్, వెలుగు : ప్లాట్‌ఫాంపై ఉంటున్న తమను ఖాళీ చేయించారన్న కోపంతో కొందరు వలస కూలీలు ఓ రైలుపై రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనలో రైలు ఏసీ బోగీ అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని తిమ్మాపూర్ రైల్వేస్టేషన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరాదికి చెందిన కొందరు వలస కూలీలు కొన్ని రోజులుగా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపైనే నివాసం ఉంటున్నారు. అక్కడే వంటలు చేసుకొని ఉంటుండడంతో స్టేషన్ మొత్తం అపరిశుభ్రంగా మారింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతుండడంతో స్పందించిన స్టేషన్ సిబ్బంది ప్లాట్‌ఫాంను ఖాళీ చేయాలని కూలీలకు చెప్పారు. ఈ క్రమంలో కూలీలు రైల్వే సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో వారు ఆర్పీఎఫ్పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.
వారు వచ్చి కూలీలను ఖాళీ చేయించారు. దీంతో ఆగ్రహానికి గురైన వలస కూలీలు మంగళవారం రాత్రి మద్యం సేవించి పట్టాల వద్దకు చేరుకున్నారు. కాచిగూడ నుంచి చిత్తూరుకు వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు. దాడిలో ఒక ఏసీ బోగీ గ్లాస్ పూర్తిగా పగిలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో నందిగామ శివారులోని జియో పెట్రోల్ బంక్ సమీపంలో రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీల కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని షాద్‌నగర్ పీఎస్‌కు తరలించారు.
