ఈ సారి వదిలేది లేదు : గోరఖ్పూర్ – లక్నో వందే భారత్ పై రాళ్ల దాడి : పగిలిన అద్దాలు

ఈ సారి వదిలేది లేదు : గోరఖ్పూర్ – లక్నో వందే భారత్ పై రాళ్ల దాడి : పగిలిన అద్దాలు

దేశంలోని ప్రజా రవాణాలో పెను మార్పులు తీసుకువస్తుందని భావిస్తున్న వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడులు ఇంకా ఆగట్లేదు.తాజాగా గోరఖ్​పుర్​ నుంచి లక్నో వెళ్తున్న వందేభారత్​రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోకి వెళ్తున్న రైలు బారాబంకిలోని సఫేబాద్​ స్టేషన్​ సమీపంలో ఆగగానే గుర్తు తెలియని వ్యక్తులు దానిపైకి రాళ్లను విసిరారు. 

అది లక్నో చేరుకోగానే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఎస్కార్ట్ బృందం కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దుండగులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. ఈ దాడిలో కోచ్‌ నంబర్‌ 3, 4 లో కిటికీ అద్దాలు పగిలిపోయాయని ఆర్‌పీఎఫ్‌ అధికారులు తెలిపారు. రైలులో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా దాడి చేసిన వారిని గుర్తిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

ఇది నాలుగో సారి..

గోరఖ్‌పూర్‌ నుంచి లక్నో వెళ్తున్న వందేభారత్‌ రైలుపై రాళ్ల దాడి ఘటన ఇది నాలుగోది.  తెలుగు రాష్ట్రాల్లో సైతం ఇలాంటి ఘటనలు జరిగాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై ఏప్రిల్ 5న  గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో కోచ్ భాగం పాక్షికంగా ధ్వంసమైంది. 

తరచూ జరుగుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రైళ్ల విషయంలో నిఘా పెంచాలని ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.