తీరు మారకుంటే.. రష్యాతో  తెగదెంపులే

తీరు మారకుంటే.. రష్యాతో  తెగదెంపులే
  • ఉక్రెయిన్ పై ఏకపక్ష దాడి అన్యాయం
  • అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్

వాషింగ్టన్: ఉక్రెయిన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే, అన్యాయంగా, ఏకపక్షంగా రష్యా దాడులు చేయడం అన్యాయమని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ స్పష్టం చేశారు. ముందస్తుగా కొన్ని నెలలపాటు ఏర్పాట్లు చేసుకుని మరీ దాడులు ప్రారంభించారని, ఈ విషయాన్ని తాము కొన్ని వారాల ముందు నుంచే చెప్పామన్నారు. రష్యా తీరు ఇలాగే కొనసాగితే అమెరికా, రష్యా మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోతాయని హెచ్చరించారు. ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించిన రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నట్లు గురువారం ఆయన ప్రకటించారు. రష్యాపై ప్రెజర్ పెంచేందుకు యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు బ్రిటన్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ వంటి దేశాలతో కలిసి ఆంక్షలను అమలు చేస్తామని ప్రకటించారు. ఇకపై డాలర్లు, యూరోలు, పౌండ్లు, యెన్​లలో రష్యా బిజినెస్​ను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  

సప్లై చైన్ లను దెబ్బతీసేలా కొత్త ఆంక్షలు 
ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై అమెరికా, బ్రిటన్, కెనడా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు మరిన్ని కొత్త ఆంక్షలను ప్రకటించాయి. గ్లోబల్ ఎకానమీ నుంచి రష్యాను దూరం చేసేందుకు మరింత కఠినమైన ఆంక్షలను విధిస్తామని గురువారం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వెల్లడించారు. అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్ల నుంచి రష్యాను దూరం పెడతామని, వీటీబీ బ్యాంకుతో సహా నాలుగు ప్రధాన రష్యన్ బ్యాంకుల ఆస్తులను ఫ్రీజ్ చేస్తామన్నారు. రష్యాపై అదనపు ఆంక్షలు విధించేందుకు నిర్ణయించామని గురువారం ఈయూ అత్యవసర సదస్సులో యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైకేల్ ప్రకటించారు. కొత్త ఆంక్షలతో రష్యన్ బ్యాంకింగ్ రంగంపై 70% ప్రభావం పడుతుందని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ చెప్పారు. రష్యన్ రక్షణ రంగ కంపెనీలు, టెక్నాలజీ కంపెనీలకూ నష్టం తప్పదన్నారు.