రాష్ట్ర సర్కార్ కు హైకోర్టు ఆదేశం

రాష్ట్ర సర్కార్ కు హైకోర్టు ఆదేశం
  • ‘మన ఊరు- మన బడి’ టెండర్ ఆపండి
  • రాష్ట్ర సర్కార్ కు హైకోర్టు ఆదేశం.. విచారణ 11కు వాయిదా
  • అనర్హులుగా ప్రకటించారంటూ కోర్టుకు వెళ్లిన రెండు సంస్థలు 


హైదరాబాద్, వెలుగు:  ‘‘మన ఊరు–మన బడి’’ పథకం అమలులో భాగంగా ఫర్నీచర్ కొనుగోళ్లకు సంబంధించిన టెండర్ ను ఆపాలని రాష్ట్ర సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు టెండర్​ను ఖరారు చేయొద్దని చెప్పింది. టెండర్‌‌ నోటిఫికేషన్‌‌ ప్రక్రియను మాత్రం కొనసాగించుకోవచ్చునని తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 9న జారీ చేసిన టెండర్‌‌ నోటిఫికేషన్‌‌ నిబంధనలకు అనుగుణంగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, తమను అనర్హులుగా ప్రకటించారంటూ కేంద్రీయ భండార్ జెనిత్‌‌ మెటప్లాస్ట్‌‌  ప్రైవేట్‌‌ లిమిటెడ్, వీ3 ఎంటర్‌‌ ప్రైజెస్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ సంస్థలు హైకోర్టులో పిటిషన్ వేశాయి.  ఎలెగంట్‌‌ మెథడాక్స్‌‌ సంస్థ అర్హత సాధించిందని అధికారులు తేల్చడంపై కోర్టులో సవాల్ చేశాయి. గ్రీన్‌‌ బోర్డుల సరఫరా వ్యవహారంపై జి.రేవంత్‌‌, మరొకరు కూడా పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.  


అర్హతలున్నా తిరస్కరించిన్రు: పిటిషనర్లు 


సంస్థల తరఫున లాయర్ అవినాశ్ దేశాయ్‌‌ వాదించారు. ‘‘పిటిషనర్లకు పాఠశాలలకు ఫర్నీచర్‌‌ సరఫరా చేసిన అనుభవం ఉంది. గడిచిన ఐదేండ్లలో రెండు కంపెనీలు ఏడాదికి రూ.180 కోట్ల టర్నోవర్‌‌ సాధించాయి. ఏపీలోని స్కూల్స్‌‌కు మెటీరియల్ సప్లయ్‌‌ చేశాయి. అర్హతలు లేని ఎలెగంట్‌‌ మెథడాక్స్‌‌ సంస్థను గుర్తించడం అన్యాయం. టెండర్‌‌ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి” అని ఆయన కోర్టును కోరారు. మరో ఇద్దరు పిటిషనర్ల తరఫున సీనియర్‌‌ లాయర్ గండ్ర మోహన్‌‌రావు, లాయర్‌‌ వి.దివికుమార్‌‌ వాదించారు. పిటిషనర్లు నోటిఫికేషన్‌‌ లో పేర్కొన్న రూల్స్ మేరకు ఎక్స్ పీరియన్స్ లెటర్లు అందజేశారని, అయినప్పటికీ అనర్హులుగా ప్రకటించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై గవర్నమెంట్‌‌ స్పెషల్‌‌ ప్లీడర్‌‌ ఎ.సంజీవ్‌‌కుమార్‌‌ స్పందిస్తూ.. టెండర్‌‌ నిబంధనల మేరకే అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. పిటిషనర్లు హైకోర్టులో సమర్పించిన అర్హత పేపర్లను టెండర్ దరఖాస్తులతో జత చేశారో? లేదో? పరిశీలించాలని కోరారు. వాదనలు విన్న కోర్టు టెండర్లను ఖరారు చేయొద్దని ఆదేశించింది. ప్రతివాదులైన ప్రభుత్వంతో పాటు ఎలెగంట్‌‌ మెథడాక్స్, కావేరి ఇంజనీరింగ్, ప్రిన్సిబోర్డు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌‌ ఫైల్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.