కాలిఫోర్నియాలో తుఫాను బీభత్సం

కాలిఫోర్నియాలో తుఫాను బీభత్సం

వరదలతో పోటెత్తిన నదులు
సురక్షిత ప్రాంతానికి వేల మంది తరలింపు

వాట్సన్​విల్లే : కాలిఫోర్నియాలో తుఫాను బీభత్సం సృష్టించింది. దీంతో పలు నదులు వరదలతో పోటెత్తాయి. ఉత్తర కాలిఫోర్నియాలోని సెంట్రల్ తీరంలో మోంటెరి కౌంటీలో పజారో నదిని వరద ముంచెత్తడంతో రైతులతో పాటు వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నదికి ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తింది. నదికి ఏర్పాటు చేసిన లెవీ(కరకట్ట) తెగిపోయి వరద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తింది. రైతులతో పాటు మొత్తం 8,500 మందిని రెస్క్యూ టీంలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

ఇండ్లు ఖాళీ చేయకుండా ఉన్నవారిని బలవంతంగా తరలించారు. శనివారం రాత్రి 50 మందిని కాలిఫోర్నియా నేషనల్ గార్డ్  సిబ్బంది రక్షించారు. కారులో నీటిలో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను వెహికల్  నుంచి బయటకు తీసి కాపాడారు. సెంట్రల్  తీర ప్రాంతంలో శాంటా క్రజ్, మోంటెరిని వేరుచేసే పజారో నది.. వరదలతో కెమికల్స్ చేరి కలుషితమైందని, ఎవరూ కూడా ఆ నీటిని తాగేందుకు గానీ, వంట చేసేందుకు గానీ వాడరాదని స్థానికులకు అధికారులు సూచించారు. కరకట్టకు రిపేర్లు చేసే పనిలో ఉన్నామని తెలిపారు. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో లో తుఫాను కారణంగా 85 అడుగుల చెట్టు ఒకటి కూలిపోయిందని వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అన్న విషయం తెలియరాలేదని చెప్పారు.