GHMC పరిధిలో త్వరలో ఎస్టీపీల అప్ గ్రేడ్‌‌.. నిరంతరం నీటి క్వాలిటీ మానిటరింగ్

GHMC పరిధిలో త్వరలో ఎస్టీపీల అప్ గ్రేడ్‌‌.. నిరంతరం నీటి క్వాలిటీ మానిటరింగ్
  •     శుద్ధి చేసిన నీటిని మూసీలో వదలకుండా నాన్​ డ్రింకింగ్ ప్రయోజనాలకు వాడకం
  •     కేంద్రానికి వాటర్ బోర్డు ప్రతిపాదనలు
  •     రూ.169 కోట్లతో అప్​గ్రేడేషన్ పనులు
  •     జల్​ హీ అమృత్​ కింద ఇన్సెంటివ్స్ ఇవ్వనున్న కేంద్రం

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఎస్టీపీలను అప్ గ్రేడ్ చేసేందుకు వాటర్​బోర్డు ప్లాన్లు రూపొందించింది. కేంద్ర సర్కారు ఇటీవల నగరానికి వాటర్​ప్లస్​అవార్డు ప్రకటించింది. ఇందులో భాగంగా జల్​ హీ అమృత్ స్కీం కింద రూ.169 కోట్ల ఇన్సెంటివ్స్​ఇవ్వనుంది. దీంతో వాటర్​బోర్డు ఆ నిధులతో సిటీలోని 18ఎస్టీపీల అప్​గ్రేడ్​చేయనున్నామంటూ ప్రతిపాదనలు రెడీ చేసి కేంద్రానికి పంపించింది. 

ఎక్కడెక్కడి ఎస్టీపీలంటే..

ప్రాజెక్టులో భాగంగా నాగోల్ లో 320 ఎంఎల్డీ కెపాసిటీ ఉన్న ఎస్టీపీని రూ. 3.83 కోట్లతో, నాగోల్​లోని 172ఎంఎల్డీల మరో ఎస్టీపీని 2.48 కోట్లతో, అత్తాపూర్​లో 51 ఎంఎల్డీ కెపాసిటీ ఉన్న ఎస్టీపీని 1.66 కోట్లతో, లింగంకుంటలోని 30 ఎంఎల్డీ ఎస్టీపీని, గోపన్నపల్లిలోని 4.5 ఎంఎల్డీ ఎస్టీపీని రూ. 1.23 కోట్లతో, మీరాలంలోని 10 ఎంఎల్డీ ఎస్టీపీని రూ.83 లక్షలతో, ఇక్కడే ఉన్న మరో 5 ఎంఎల్డీ ఎస్టీపీ రూ. 62 లక్షలతో నల్లచెరువులోని 30 ఎంఎల్డీ ఎస్టీపీని రూ. 82.24 లక్షలతో, ఖాజాకుంట 12ఎంఎల్డీ ఎస్టీపీని 82.24 లక్షలతో, సఫిల్​గూడలోని 0.6 ఎంఎల్డీ ప్లాంట్​ను 20.20 లక్షలతో, ఎన్​ఎం కుంటలోని 4ఎంఎల్డీ ఎస్టీపీని 20.19 లక్షలతో, లంగర్​హౌజ్​ లోని 1.2 ఎంఎల్డీ ఎస్టీపీని 19.35 లక్షలతో, దుర్గం చెరువును 5ఎంఎల్డీ ఎస్టీపీని 1.65 కోట్లతో, ఖాజాగూడలోని 7 ఎంఎల్డీ, నానక్​రామ్​గూడ 4.5 ఎంఎల్డీ ఎస్టీపీని రూ. 14.48 కోట్లతోనూ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 

శుద్ధి చేసిన నీటి వినియోగం ఇలా.. 

కేంద్రం ఇచ్చే నిధులతో ఆయా ట్రీట్​మెంట్​ప్లాంట్లలో ప్రస్తుతం ఉన్న  నీటి శుద్ధి మెషీన్లను (ఎరేషన్​ సిస్టమ్​)ను మార్చి కొత్త వాటిని బిగిస్తారు. గ్రిడ్​లైన్లను మారుస్తారు. నీటి క్వాలిటీని నిరంతరం మానిటర్​చేసే పరికాలను అమరుస్తారు. ఇంటర్నేషనల్​స్టాండర్డ్స్​కు అనుగుణంగా మురుగునీటి శుద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటారు. 

ప్రస్తుతం మూసీ వెంట ఉన్న ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని తిరిగి మూసీలోకే వదులుతున్నారు. కానీ, ఎస్టీపీల అప్​గ్రేడేషన్​తర్వాత శుద్ధి చేసిన కొంత నీటిని మూసీలోకి వదిలి మరి కొంత నీటిని రిజర్వాయర్లలో నిల్వ చేసేలా ప్లాన్లు రూపొందిస్తున్నారు. 

ఈ నీటిని తాగడానికి కాకుండా  గార్డెనింగ్, క్లీనింగ్, భవన నిర్మాణాలకు వాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే విషయమై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం వాటర్​బోర్డు సరఫరా చేస్తున్న తాగునీటినే కొందరు భవన నిర్మాణాలకు, చెట్లకు పోసేందుకు ఉపయోగిస్తున్నారు. దీంతో చాలా నీరు వృథా పోతోంది. కానీ, ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని ఆయా అవసరాలకు సరఫరా చేస్తే సమస్య తగ్గుతుందంటున్నారు.