అంతరిక్షంలో వింత గ్రహం.. ఇసుక మేఘాలు

అంతరిక్షంలో వింత గ్రహం.. ఇసుక మేఘాలు
  •        ఒక ఏడాదికి 10 వేల ఏండ్లు

వాషింగ్టన్ డీసీ: అంతరిక్షంలో మరో వింత గ్రహాన్ని నాసా ఆధ్వర్యంలోని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సైంటిస్టుల బృందం గుర్తించింది. భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘వీహెచ్ఎస్ 1256 బీ’ అనే ఈ యంగ్ ప్లానెట్ వయస్సు 15 కోట్ల ఏండ్లేనని అంచనా.  యంగ్ ఏజ్ లో ఉండటం వల్ల దీనిపై వాతావరణం ఇసుక మేఘాలతో భీకరంగా ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇక్కడ వేడిగా ఉండే ఇసుక రేణువులు పైవైపున, చల్లగా ఉండే ఇసుక రేణువులు కింది వైపున సుడులు తిరుగుతున్నాయని, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, నీటి ఆనవాళ్లు కూడా ఈ గ్రహ వాతావరణంలో ఉన్నాయని కనుగొన్నారు. ఒకే గ్రహానికి సంబంధించి ఇన్ని ఆసక్తికర విషయాలను ఒకేసారి కనుగొనడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. ఈ గ్రహం రెండు జంట నక్షత్రాల చుట్టూ తిరుగుతోందట. మన సూర్యుడికి, ప్లూటోకి ఉన్న దూరంతో పోలిస్తే.. 4 రెట్లు దూరంగా ఇది తన జంట నక్షత్రాల చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల.. ఇక్కడ దాదాపు 10 వేల ఏండ్లకు ఒక ఏడాది కాలం పూర్తవుతుందని అంచనా వేశారు. కానీ మనతో పోలిస్తే ఒక రోజుకు పట్టే సమయం మాత్రం 2 గంటలు తక్కువగా 22 గంటలు ఉంటుందని గుర్తించారు. ఈ గ్రహంపై మరింత స్టడీ చేస్తే.. ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలిసే అవకాశం ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు.