- విచ్చలవిడిగా పెరుగుతున్న స్ట్రీట్ డాగ్స్ పాపులేషన్
- నియంత్రణ తమ పని కాదంటూ లైట్ తీసుకుంటున్న వెటర్నరీ, పంచాయతీ ఆఫీసర్లు
- జిల్లాలో తాజాగా రేబిస్ లక్షణాలతో మహిళ మృతి
- జీడబ్ల్యూఎంసీలో ఏబీసీ సెంటర్ ఉన్నా ఇదే పరిస్థితి
హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీధికుక్కల బెడద కలవరపెడుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా కుక్కలు గుంపులుగా తిరుగుతూ జనాల మీద దాడులకు దిగుతూ వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరుకు చెందిన ఓ మహిళ కుక్కకాటుకు గురై రేబిస్ లక్షణాలతో ప్రాణాలు కోల్పోయింది. జిల్లా వెటర్నరీ, పంచాయతీ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు కుక్కల నియంత్రణ పని తమ పరిధిలోకి రాదంటూ చేతులు దులిపేసుకుంటుండటంతో ఊళ్లలో వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనగా, గ్రేటర్ వరంగల్ పరిధిలో యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ ఉన్నా అక్కడా ఇదే సిట్యుయేషన్ కనిపిస్తుంది.
కంట్రోల్ లేకే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1683 పంచాయతీల్లో కలిపి వీధి కుక్కల సంఖ్య 1.4 లక్షల వరకు ఉంటుందని అధికారుల అంచనా. అందులో గ్రేటర్ వరంగల్ పరిధిలోనే 50 వేలకు పైగా ఉంటాయని చెబుతున్నారు. వీధి కుక్కల బెడద, కుక్కకాట్ల నియంత్రణ, వాటి సంతానోత్పత్తికి అడ్డుకట్ట వేసేందుకు గ్రామాల్లో ఎక్కడా యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ నిర్వహించడం లేదు. ఆర్థిక భారంతో సమస్యను వదిలేస్తుండగా, యానిమల్ బర్త్ కంట్రోల్ విషయాన్ని జిల్లా అధికారులు కూడా లైట్ తీసుకుంటున్నారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రతి రోజు సగటు 20 నుంచి 25 మంది కుక్కకాటుతో ఎంజీఎం ఆస్పత్రికి పరుగులు తీస్తుండగా, రూరల్ ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏప్రిల్ 19న హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లెలో ఓ పిచ్చికుక్క ఆరుగురిపై దాడి చేసింది. భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి కాశా కాలనీలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు వృద్ధులపై పిచ్చికుక్కలు దాడి చేసి తీవ్రంగా కరిచాయి. అంతకుముందు ఎల్కతుర్తిలో తొమ్మిది మంది పిచ్చికుక్క కాటుకు గురయ్యారు. ఇలా ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎక్కడోచోట వీధి కుక్కల దాడులు పెరుగుతూనే ఉన్నాయి.
దిక్కుతోచని స్థితిలో పంచాయతీలు..
ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ యాక్ట్-1960, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్-2001, 2023 ప్రకారం వీధికుక్కలను చంపడం నేరం. పంచాయతీ ఎన్నికల సమయంలో చాలా గ్రామాల్లో వీధి కుక్కల బెడదను తీరుస్తామని హామీలిచ్చి కొంతమంది అభ్యర్థులు ఓట్లు రాబట్టారు. ఇచ్చిన హామీ మేరకు శాయంపేట మండలం పత్తిపాకతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో కుక్కలను చంపించారు. ఆ తర్వాత ఎన్జీవోలు ఇచ్చిన ఫిర్యాదుతో చిక్కుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలోనే చాలా గ్రామాల్లో కుక్కల సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పాలకవర్గ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
పరిధి కాదంటున్న ఆఫీసర్లు..
ఆర్థిక భారంతో పాటు వెటర్నరీ, పంచాయతీ ఆఫీసర్ల సమన్వయ లోపంతో గ్రామాల్లో వీధి కుక్కల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో కుక్కలకు వ్యాక్సినేషన్ తో పాటు వాటి సంఖ్యనూ నియంత్రణకు చర్యలు చేపట్టాలి. అవకాశాన్ని బట్టి ఎన్జీవోల సహకారం కూడా తీసుకోవచ్చు. ఈ మేరకు కుక్కల నియంత్రణకు అవసరమయ్యే నిధుల వినియోగం, పంచాయతీలకు మార్గదర్శకాలు, సూచనలు ఇవ్వడంలాంటివి జిల్లా పంచాయతీ ఆఫీసర్లు చూసుకోవాలి.
కానీ క్షేత్రస్థాయిలో అధికారుల మధ్య సమన్వయం లేక కుక్కల సమస్య పరిష్కారం కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై జిల్లా వెటర్నరీ ఆఫీసర్ రాధాకిషన్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్ ను వివరణ కోరగా కుక్కల సంఖ్య నియంత్రణ పని తమ పరిధి కాదంటూ సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి వీధి కుక్కల సమస్యకు పరిష్కారం చూపేలా తగిన చర్యలు తీసుకోవాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.
నర్సంపేటలో 16 మందిపై పిచ్చి కుక్కదాడి
నర్సంపేట: నర్సంపేటలో ఓ పిచ్చికుక్క మంగళవారం స్వైర విహారం చేసి 16 మందిని గాయపర్చింది. టౌన్‌లోని గాంధీబొమ్మ నుంచి సాయిబాబా టెంపుల్ రూట్లో వెళ్తూ ఎదురుపడ్డ వారిపై దాడి చేసింది. సాయిబాబా కాలనీకి చెందిన 10 మందితోపాటు మరో ఆరుగరికి గాయాలు కాగా నర్సంపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి, ప్రాథమికి చికిత్స చేశారు. పేషంట్లకు సరిపడా వ్యాక్సిన్ లేకపోవడంతో బయట నుంచి తెచ్చి వేశారు. చికిత్స పొందుతున్న వారిని నర్సంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్ పరామర్శించారు

