రాష్ట్రంలో కుక్కల దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఉదయం కామారెడ్డిలో మూడేళ్ల బాలుడిపై తీవ్రంగా దాడి చేశాయి వీధి కుక్కలు. ఆ బాలుడి పరిస్థితి విషమంగానే ఉంది. ఈ ఘటన జరిగిన గంటల్లోనే లేటెస్ట్ గా వరంగల్ లోని బట్టల బజార్ లో శ్రీను అనే కానిస్టేబుల్ పై దాడి చేసింది. వీధి కుక్క ఓ వృద్ధురాలిపై దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన కానిస్టేబుల్ ను తీవ్రంగా గాయపర్చింది. వృద్దురాలితో పాటు కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు స్థానికులు.
కుక్కల దాడుల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
