భారతీయులకు యూఎస్ ఎంబసీ హెచ్చరిక.. చట్టం అతిక్రమిస్తే క్రిమినల్ పెనాల్టీలు..

భారతీయులకు యూఎస్ ఎంబసీ హెచ్చరిక.. చట్టం అతిక్రమిస్తే క్రిమినల్ పెనాల్టీలు..

అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడాలని కలలు కనే భారతీయులకు, ముఖ్యంగా అక్రమ మార్గాల్లో వెళ్లాలని చూసే వారికి యూఎస్ ఎంబసీ తాజాగా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అక్రమ వలసలను అరికట్టడమే లక్ష్యంగా సరికొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఎవరైనా భారతీయులు అమెరికా చట్టాలను అతిక్రమిస్తే కఠినమైన శిక్షలు తప్పవని ఎంబసీ తన ఎక్స్ పోస్టులో స్పష్టం చేస్తోంది. కేవలం హెచ్చరికలు మాత్రమే కాకుండా.. ఇప్పటికే వేల సంఖ్యలో భారతీయులను స్వదేశానికి తిడీపోర్టేషన్ కూడా చేసిన విషయం తెలిసిందే.

ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన 'లేకెన్ రైలీ యాక్ట్', కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ప్రకారం.. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినా లేదా వీసా గడువు ముగిసినా నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి వారికి జైలు శిక్షతో పాటు దేశం నుంచి బహిష్కరించడం వంటి చర్యలు ఉంటాయని ఎంబసీ స్పష్టం చేసింది. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారు భవిష్యత్తులో అమెరికా వీసా పొందే అర్హతను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. 2025లో ఇప్పటివరకు దాదాపు 25 లక్షల మంది అక్రమ వలసదారులు అమెరికాను వీడినట్లు లెక్కలు చెబుతున్నాయి.

ముఖ్యంగా విద్యార్థులు, పర్యాటకులు తమ వీసా పరిమితులను మించి అమెరికాలో స్టే చేయటం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. వీసా అనేది ఒక 'ప్రివిలేజ్' మాత్రమేనని, అది ఏ ఒక్కరి హక్కు కాదని ఎంబసీ గుర్తు చేస్తోంది. అమెరికాలోని సరిహద్దుల వద్ద నిఘా పెంచడమే కాకుండా, వీసా మోసాలకు పాల్పడే ట్రావెల్ ఏజెన్సీలపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు. కాబట్టి మోసపూరిత ఏజెంట్లను నమ్మి ప్రమాదకరమైన ప్రయాణాలు చేయవద్దని, చట్టబద్ధమైన మార్గాల్లో మాత్రమే అమెరికాలోపలికి ఎంటర్ కావాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనల మార్పుల గురించి తెలుసుకునేందుకు అమెరికా వెళ్లాలనుకునే వారు ఎప్పటికప్పుడు అధికారిక వీసా వెబ్‌సైట్‌లను గమనిస్తూ ఉండటం మంచిది.