జీవో నం.7ను రద్దు చేయకుంటే.. సీఎం ఇంటిని ముట్టడిస్తాం : విద్యార్థి జేఏసీ చైర్మన్ రామకృష్ణ

జీవో నం.7ను రద్దు చేయకుంటే.. సీఎం ఇంటిని ముట్టడిస్తాం : విద్యార్థి జేఏసీ చైర్మన్ రామకృష్ణ
  • విద్యార్థి జేఏసీ చైర్మన్ రామకృష్ణ హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.7ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే సీఎం రేవంత్​రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ హెచ్చరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఏ మాత్రం స్పష్టత లేదని, దీంతో 14 లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు ఎప్పుడు జమ చేస్తారో ఇప్పటివరకు స్పష్టత లేదని, సర్కారు నుంచి నిధులు అందిన తర్వాతే చెల్లిస్తామంటే కాలేజీ యాజమాన్యాలు అంగీకరించడం లేదని తెలిపారు.

ఫీజులు కడితేనే అడ్మిషన్లు ఇస్తామని యాజమాన్యాలు తెగేసి చెబుతుండటంతో పేద విద్యార్థులు వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలను విడుదల చేయాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.