బస్ పాస్ ధరల పెంపుపై విద్యార్థుల ఆందోళన

బస్ పాస్ ధరల పెంపుపై విద్యార్థుల ఆందోళన

పెరిగిన ఆర్టీసీ చార్జీలతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్తుంటే..ఇప్పుడు బస్ పాస్ చార్జీలు కూడా భారీగా పెంచడంపై నిరసన వ్యక్తమౌతోంది. టికెట్ రేట్లపై విద్యార్థులు పలుచోట్ల నిరసన వ్యక్తం చేస్తుండగా, ఒక్కసారే 300శాతం పెంచడమేంటని ప్రశ్నిస్తున్నారు. చదువులకు దూరం చేసే ఉద్దేశంతోనే స్టూడెంట్ పాసులను ఇంతగా పెంచారని మండిపడుతున్నారు. బస్ పాస్ చార్జీలు తగ్గించకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

వరుసగా ఏదో రకమైన చార్జీ పేరుతో ఆర్టీసీ టికెట్ ధరలను పెంచేస్తోంది సంస్థ. డీజిల్ సెస్ పేరుతో తాజాగా చార్జీలను వడ్డించి ప్రయాణికుల నడ్డి విరిచింది ఆర్టీసీ యాజమాన్యం. ఇవి చాలవన్నట్టూ...ఇప్పుడు విద్యార్థులే టార్గెట్ గా బస్ పాస్ ధరలను విపరీతంగా పెంచేసింది. రూట్ లేదా జనరల్ బస్ పాస్ తో స్కూల్స్, కాలేజీలకు పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలే ఆర్టీసీలో వెళ్తారు. కానీ సంస్థ ఏ మాత్రం కనికరం లేకుండా బస్ పాస్ పై ఏకంగా 300 శాతం పెంచడంపై స్టూడెంట్స్ మండిపడ్తున్నారు.

హైదరాబాద్ లేదా మరే ఇతర పట్టణంలో పెరిగిన బస్ పాస్ ధరల చూస్తే.. 4 కిలోమీటర్లకు పాతరేట్ 165 ఉంటే, ఇప్పుడు 450 రూపాయలకు పెంచేసింది. 8 కిలోమీటర్ కు 200 ఉంటే ఇప్పుడు 600 కి పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో రూట్ పాస్ ధర.. 3 నెలలకు 10 కిలోమీటర్లకు 415 ఉంటే, ఇప్పుడు 680 కి పెంచింది ఆర్టీసీ. 20 కిలోమీటర్లకు 675 పాత ధర వుంటే, ప్రస్తుతం అది 11 వందల 50 కి పెంచేశారు. ఇలా పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు విద్యార్థులు.

 గతంలో ఎన్నడూ లేనంతగా 300 శాతం పైగా పెంచడంపై ఇప్పటికే అన్నిస్కూల్స్, కాలేజీల విద్యార్థుల నుంచి నిరసన వ్యక్తమౌతోంది. దీంతో విద్యార్థి సంఘాలు భవిష్యత్ కార్యాచరణకు పిలుపునిచ్చాయి. పేద, మధ్యతరగతి విద్యార్థులను చదువులకు దూరం చేయడానికే ప్రభుత్వం కుట్రపూరితంగా బస్ పాస్ ధరలను పెంచిందని మండిపడ్తున్నారు.

బస్ పాస్ ధరలు పెంచడంపై అంతటా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అన్ని వస్తువుల రేట్లు పెరిగి ఇబ్బంది పడుతున్న తమకు బస్ పాస్ ధరలు మరింత భారమవుతాయని స్టూడెంట్స్ అంటున్నారు.