బిడ్డా..! జాబ్​ కొడ్తనంటివి.. శవమై వస్తివా..

బిడ్డా..! జాబ్​ కొడ్తనంటివి.. శవమై వస్తివా..
  • సునీల్​ డెడ్​బాడీని చూసి గుండెలు బాదుకున్న కుటుంబసభ్యులు, తండావాసులు
  • రాంసింగ్​ తండాలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
  • అర్ధరాత్రి 11 దాకా అంబులెన్స్​లోనే డెడ్​బాడీ
  • రూ. 5 లక్షలు, డబుల్​ బెడ్రూం ఇల్లు, ఉద్యోగం ఇస్తామని ఆఫీసర్ల హామీ
  • లీడర్లను బలవంతంగా తరలించిన పోలీసులు
  • సర్కారు తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

మహబూబాబాద్​/గూడూరు, వెలుగు: ‘ఎవుసం పనులు, కూలినాలి చేసి కష్టపడి పెంచుకుంటిమి కొడుకా... గవర్నమెంట్​ జాబ్​ కొడుతనని వెళ్లి శవమై వచ్చినవా బిడ్డా..’  అని బోడ సునీల్​ తల్లిదండ్రులు బోడ మల్లిక,  రాంధన్  గుండెలవిసేలా రోదించారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్​ నిమ్స్​లో సునీల్  చనిపోగా.. ​డెడ్​బాడీని పోలీసులు హైడ్రామా నడుమ  సాయంత్రం 5 గంటలకు మహబూబాబాద్​ జిల్లా గుండెంగ శివారులోని ఆయన స్వగ్రామం తేజావత్​ రాంసింగ్ తండాకు తీసుకువచ్చారు. ఏడు పోలీస్​ వాహనాలు వెంటరాగా, అంబులెన్స్​లో వచ్చిన డెడ్​బాడీని చూసి కుటుంబ సభ్యులతో పాటు, తండా వాసులు గుండెలు బాదుకున్నారు. సునీల్​ది ప్రభుత్వ హత్యేనని, ఇందుకు మూల్యం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి 
రాష్ట్ర ప్రభుత్వం జాబ్​ నోటిఫికేషన్లు జారీ చేయడం లేదని, ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు 61 ఏండ్లకు పెంచిందని తీవ్ర మనస్తాపానికి గురైన సునీల్​ మార్చి 26న కేయూ వద్ద పురుగుల మందు తాగి సూసైడ్​ అటెమ్ట్​ చేశాడు. తొలుత ఎంజీఎంలో ట్రీట్​మెంట్​ అందించగా.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని నిమ్స్​కు తరలించారు. అక్కడ  ట్రీట్​మెంట్​పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు.

తండాలో ఉద్రిక్తత
సునీల్ కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని తేజావత్ ​రాంసింగ్ తండా వాసులు డిమాండ్​ చేశారు. డెడ్​బాడీని స్వగ్రామానికి తీసుకువస్తున్నారన్న విషయం తెలుసుకొని రాజకీయ పార్టీల నేతలు, నిరుద్యోగులు, స్టూడెంట్లు, బంధువులు, చుట్టు పక్కల తండా వాసులు రాంసింగ్​ తండాకు చేరుకున్నారు. సునీల్​ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసే వరకు అంబులెన్స్​ నుంచి డెడ్​బాడీని దించేది లేదన్నారు. వీరికి బీజేపీ స్టేట్​ ఎస్టీ సెల్​ అధ్యక్షుడు జాటోతు హుస్సేన్​ నాయక్​, బీజేపీ రాష్ట్ర నాయకుడు రాకేష్​ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తెంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్​ గౌడ్, ప్రజాసంఘాల నేతలు, స్టూడెంట్స్​ మద్దతు పలుకుతూ ఆందోళనలో పాల్గొన్నారు. కలెక్టర్​ రావాలని,  బాధిత కుటుంబానికి రూ. కోటి నగదు, ఒకరికి సర్కారు ఉద్యోగం ప్రకటించాలని డిమాండ్​ చేశారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు మహబూబాబాద్​ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి  ప్రభుత్వం నుంచి లక్ష నగదు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్​ బెడ్రూమ్​ ఇల్లు ఇస్తామన్నారు. కుటుంబీకులు, స్థానికులు అంగీకరించలేదు. దీంతో లీడర్లను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లను పోలీసులు బలవంతగా వెహికల్స్​లో తరలించారు. రూ. 5 లక్షల నగదు, డబుల్​ బెడ్రూం ఇల్లు, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగం ఇస్తామని ఆర్డీవో కొమురయ్య హామీ ఇచ్చారు. అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో అంబులెన్స్​ నుంచి డెడ్​బాడీని కిందికి దించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సునీల్​ మృతదేహానికి ఎస్పీ  కోటిరెడ్డి నివాళులర్పించారు. 

సునీల్​ మృతి బాధాకరం: ఎంపీ మాలోత్​ కవిత
సునీల్ సూసైడ్ చేసుకోవడం బాధాకరమని మహబూబాబాద్​ ఎంపీ మాలోత్​ కవిత, ఎమ్మెల్యే బానోతు శంకర్​ నాయక్​ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.  యువత  క్షణికావేశంలో ప్రాణాలను తీసుకోవద్దని ఎస్పీ కోటిరెడ్డి కోరారు.

ఇష్టమున్న రూట్లలో డెడ్​బాడీని తిప్పిన పోలీసులు
హైదరాబాద్​లోని నిమ్స్ లో శుక్రవారం తెల్లవారుజామున సునీల్  మృతి చెందగా.. పోలీసులు గాంధీ హాస్పిటల్​కు పోస్టుమార్టం కోసం తీసుకెళ్లారు. అక్కడ పోస్టుమార్టం తర్వాత డెడ్​బాడీని సునీల్​ స్వగ్రామం తేజావత్​ రాంసింగ్​ తండాకు తరలింపులో హైడ్రామాకు తెరలేపారు. ముందు, వెనుక ఏడు పోలీస్​ వాహనాలు వెంటరాగా, అంబులెన్స్​లో ఉన్న కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇష్టమొచ్చిన రూట్​లో వెహికల్స్​ను తిప్పారు.  హైదరాబాద్​ నుంచి నకిరేకల్​ మీదుగా మహబూబాబాద్​ జిల్లాలోని మరిపెడ నుంచి కురవి, అక్కడి నుంచి మహబూబాబాద్,  కేసముద్రం, నాగారం బైపాస్​ రోడ్డు నుంచి రాంసింగ్​ తండాకు సాయంత్రం 5 గంటలకు  తరలించారు. మెయిన్​రోడ్డును వదిలి  కేసముద్రం నుంచి ఊళ్ల మీదుగా తండాకు తేవడంపై  స్టూడెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.