ముగిసిన సునీల్ అంత్యక్రియలు

ముగిసిన సునీల్ అంత్యక్రియలు

చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం లేదంటూ ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. తమ సాంప్రదాయం ప్రకారం  కుటుంబ సభ్యులు రాంసింగ్ తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతిమయాత్రలో సునీల్ నాయక్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు సునీల్ అంత్యక్రియల టైంలో రాంసింగ్ తండాకు బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

శనివారం సునీల్ డెడ్ బాడీ తీవ్ర ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ నుంచి మహబూబాబాద్ జిల్లా రాంసింగ్ తండాకు చేరవేశారు. అంబులెన్స్‌కు ముందు, వెనుక ఏడు పోలీస్ వాహనాలను భద్రత కోసం ఏర్పాటు చేశారు. కాగా.. అంబులెన్స్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులు ఇష్టమొచ్చిన రూట్‌లో అంబులెన్స్‌ను తిప్పారు. హైదరాబాద్ నుంచి నకిరేకల్ మీదుగా మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ, కురవి, అక్కడి నుంచి మహబూబాబాద్, కేసముద్రం, నాగారం బైపాస్ రోడ్డు మీదుగా తండాకు డెడ్ బాడీని తరలించారు. మెయిన్ రోడ్డు వదిలి కేసముద్రం నుంచి ఊర్ల మీదుగా తండాకు మృతదేహాన్ని తరలించడంపై స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీల్ మృతదేహాన్ని చూసి.. ఆయన తల్లి గుండెలు బాదుకుంది. కొలువు కొడ్తానని.. శవమై వచ్చావా అంటూ ఆమె ఏడ్వటం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. 

కాగా.. సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు శనివారం రాత్రి ఆందోళన చేశారు. ప్రభుత్వం నుంచి లక్ష నగదు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బ్రెడ్రూం ఇళ్లు ఇస్తామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి చెప్పారు. కానీ, దీనికి కుటుంబ సభ్యులు, స్థానికులు అంగీకరించలేదు. చివరకు 5 లక్షల నగదు, డబుల్ బెడ్రూం ఇళ్లు, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ఆర్డీవో కొమురయ్య హామీ ఇచ్చారు. దాంతో సునీల్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు అంగీకరించారు.