
- వైన్ షాపులొద్దు...జాబ్స్ కావాలె
- జాబ్స్ నోటిఫికేషన్లు ఎప్పుడిస్తరని నిలదీత
మహబూబ్నగర్/ పాలమూరు, వెలుగు: రాష్ట్రంలో జాబ్స్ లేక నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నారని, నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం లిక్కర్ షాపులకు అనుమతులు ఇవ్వడం ఏంటని రాష్ర్ట ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఎస్ఎఫ్ఐ, గిరిజన విద్యార్ధి సంఘాల నేతలు నిలదీశారు. ప్రభుత్వం ఆమ్దాని పెంచుకునేందుకే వైన్స్ షాపులు తెరుస్తోందని ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి తిరిగివెళ్తున్న మంత్రిని స్టూడెంట్ లీడర్లు అడ్డుకున్నారు. పీజీలు, డబుల్ పీజీలు చేసి.. వేలాది మంది నిరుద్యోగులు జాబ్స్, ఉపాధి లేక నిరాశతో ఉన్నారన్నారు. తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు ఇస్తోందని మంత్రి చెప్పగా.. వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు ఎవరు అడిగారని నిలదీశారు. ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించి 7 నెలలైనా ఇప్పటికీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు.
లిక్కర్ షాపుల రిజర్వేషన్లు ఖరారు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టంలో లిక్కర్షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, గౌడ్ లకు కేటాయించాల్సిన లిక్కర్ షాపులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన లాటరీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టంలో గౌడ, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా బలపడేందుకు మద్యం షాపులను కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 2,620 వైన్స్ షాపుల్లో గౌడ్లకు 15 శాతం కోటాగా 36 3, ఎస్సీలకు పది శాతం కింద 262, ఎస్టీలకు ఐదు శాతం కింద 131 షాపులు కేటాయించినట్లు చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో 90 వైన్స్ షాపులకు గాను గౌడ్లకు 14, ఎస్సీలకు 10, ఎస్టీలకు 3 కేటాయించినట్లు చెప్పారు. గతంలో షాపులు తీసుకున్నవారు రెండు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సిఉండేదని, ఈసారి ఒకగ్యారంటీ ఇస్తే చాలని చెప్పారు. గతంలో ఒకరు ఒకే షాపు తీసుకునే వీలుండేదని, ఇప్పుడు ఆ పరిమితి లేదన్నారు. రాష్ట్రంలో గుడుంబా తయారీ, గంజాయి సాగు, రవాణా, కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికడతామని చెప్పారు. ఈ కార్యక్రమం తర్వాత మంత్రి జిల్లాలో కొత్తగా నియమించిన 23 మంది ఏఎన్ఎంలకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అడిషనల్కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, కె.సీతా రామారావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఖురేషి, సీఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.