- నైతిక విలువల పెంపులో స్కౌట్స్ అండ్ గైడ్స్‌ది కీలక పాత్ర: భట్టి
హైదరాబాద్, వెలుగు: నిజమైన స్కౌట్ అండ్ గైడ్ అంటే కేవలం యూనిఫామ్ ధరించిన వ్యక్తి మాత్రమే కాదని, నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, ధైర్యం, కరుణ వంటి మానవీయ విలువలను జీవితంలో ఆచరించేవాళ్లే అసలైన స్కౌట్లు అని గవర్నర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షుడు శివ ప్రతాప్ శుక్లా అన్నారు. విద్యార్థుల ప్రతిభను కేవలం పరీక్షల్లో వచ్చే మార్కులతోనే అంచనా వేయలేమని, సమాజ సేవ పట్ల నిబద్ధతతో మార్పు తీసుకురావడమే నిజమైన విద్యకు నిదర్శనమని పేర్కొన్నారు.
హైదరాబాద్ దోమల్‌గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ ఆఫీసులోని మోడల్ హైస్కూల్ ఆధునీకరణ, పునరుద్ధరణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ స్కూల్ అభివృద్ధికి సింగరేణి ద్వారా రూ.2.50 కోట్ల సీఎస్ఆర్ నిధులు సమకూర్చిన డిప్యూటీ సీఎం భట్టికి గవర్నర్ అభినందనలు తెలిపారు. స్కౌట్ గీతంలోని స్ఫూర్తిదాయక సందేశాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాష్ట్రంలోని అన్ని బడుల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో స్కౌట్స్ సభ్యత్వం 47 వేలకు పైగా పెరగడాన్ని ప్రశంసించారు. డ్రగ్స్ నిర్మూలన, విపత్తు నిర్వహణలో స్కౌట్స్ చురుగ్గా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
నైతిక విలువలదే ప్రాధాన్యం: భట్టి
కొత్త టెక్నాలజీ కాలంలో నైతిక విలువలు, క్రమశిక్షణ కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిస్వార్థ సేవే నాయకత్వానికి పునాదులు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3,200 బడుల్లో 1.30 లక్షల మంది విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను చేరువ చేయడమే లక్ష్యమన్నారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ..గురుకులాల్లో స్కౌటింగ్, గైడింగ్ విస్తరించాలని అధికారులకు సూచించారు.
