సర్కారు స్కూళ్లు, హాస్టళ్లలో బువ్వ తినాలంటే భయం

సర్కారు స్కూళ్లు, హాస్టళ్లలో బువ్వ తినాలంటే భయం
  • పెరుగుతున్న ఫుడ్ ​పాయిజనింగ్ ​ఘటనలు
  •     క్వాలిటీ లేని  కూరగాయలు, సరుకులు..
  •      సర్కారు ఇచ్చే పైసలు చాల్తలేవంటున్న నిర్వాహకులు
  •      మొన్న ట్రిపుల్ ఐటీలో  కప్ప, పురుగులు
  •     తాజాగా ఒకేరోజు మూడు చోట్ల 105 మందికి అస్వస్థత

వెలుగు, నెట్​వర్క్​: సర్కారు హాస్టళ్లలో పెడుతున్న ఫుడ్​ తిని విద్యార్థులు దవాఖానాల పాలవుతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక చోట టిఫిన్​, మధ్యాహ్న, రాత్రి భోజనాల్లో పురుగులు, బొద్దింకలు కనిపించడం కామన్​గా మారింది. ఈ ఆహారం తింటున్న పిల్లలు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో హాస్పిటల్స్​లో అడ్మిట్​ కావాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఉదయం వండిన అన్నం, కూరలను రాత్రి కూడా పెడుతున్నారు. అవి పాచిపోయినా, వాసన వస్తున్నా ఏమీ చేయలేక సర్దుకుపోయి తింటున్నారు. అవి తినలేనివారు పస్తులతో పడుకుంటున్నారు. 

మీల్స్​ రేట్లు, మెస్ ​చార్జీలు సరిపోకనే..

సర్కారు ఇచ్చే మీల్స్​ రేట్లు, మెస్​చార్జీలు సరిపోక స్కూళ్లు, హాస్టళ్లలోని స్టూడెంట్స్​కు నిర్వాహకులు క్వాలిటీ లేని ఫుడ్​ పెడుతున్నారు. నిత్యావసరాలు, కూరగాయల రేట్లు పెరుగుతున్నా ఏడేండ్లుగా  చార్జీలు పెంచకపోవడంతో తక్కువ క్వాలిటీ పప్పు, ఉప్పు, కారం, చింతపండుతో పాటు అమ్మగా మిగిలిన కూరగాయలను అగ్గువకు తెచ్చి వండుతున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదోచోట స్టూడెంట్స్​ ఫుడ్​పాయిజనింగ్ తో  దవాఖానాల పాలవుతున్నారు. సర్కారు సప్లై చేసే బియ్యం కూడా బాగుండడం లేదని చెబుతున్నారు. అటు కిచెన్లు లేక బయటే వండాల్సి రావడం, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల కూడా ఫుడ్​లో పురుగులు పడుతున్నాయి. ఆదిలాబాద్​లోని ట్రిపుల్ ఐటీలో ఇటీవల బ్రేక్​ఫాస్ట్​లో కప్ప, పురుగులు రాగా, బుధవారం ఒక్కరోజే ఆదిలాబాద్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లో మూడు చోట్ల 105 మంది స్టూడెంట్స్​ ఫుడ్​పాయిజనింగ్​బారిన పడ్డారు. ఈ ఫుడ్​ తినలేకపోతున్నామంటూ మెదక్​ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిప్పల్ తుర్తి  కేజీబీవీ స్టూడెంట్స్ రోడ్డెక్కి ఆందోళన చేశారు. 

 సరిపోను పైసలియ్యని సర్కారు  

స్టేట్​వైడ్​26, 040  గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూల్స్ లో మొత్తం 21.50 లక్షల మంది స్టూడెంట్లకు మిడ్ ​డే మీల్స్​ పెడుతున్నారు. 1706  ప్రీ మెట్రిక్,​  పోస్ట్​మెట్రిక్​ హాస్టళ్లు, 326 గురుకులాలు, 400కు పైగా ఉన్న కేజీబీవీల్లో  కలిపి 3.6 లక్షలమంది స్టూడెంట్లకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్​, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం పెడుతున్నారు. అన్ని స్కూళ్లు, హాస్టళ్లలో వంట చేసి, వడ్డించే బాధ్యతను ప్రైవేట్​ ఏజెన్సీలకు అప్పగించారు. ప్రస్తుతం ప్రైమరీ స్కూల్స్​​లో ఒక్కో స్టూడెంట్​కు రూ.4.97, హై స్కూల్స్​లో రూ.7.45 చొప్పున, హాస్టళ్లలో మూడు నుంచి ఎనిమిదో తరగతి స్టూడెంట్లకు రోజుకు రూ. 31, తొమ్మిది, పదో తరగతి స్టూడెంట్స్​కు రూ.36, పోస్ట్​మెట్రిక్​కు అయితే రూ. 50 చొప్పున చెల్లిస్తున్నారు. 2015 తర్వాత హాస్టళ్లలో మళ్లీ మెస్ ఛార్జీలు పెంచలేదు. ఏడేండ్లలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల పెరగడంతో కూరగాయలు, నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగాయి.  ఆ మేరకు మీల్స్​ రేట్లు, మెస్​చార్జీలు సవరించాలని కొన్నేళ్లుగా నిర్వాహకులు డిమాండ్​ చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. దీంతో విసుగు చెందిన నిర్వాహకులు ఫుడ్​లో క్వాలిటీ సంగతి వదిలేశారు. 

తనిఖీలు సున్నా.. 

గవర్నమెంట్​ స్కూళ్లు, రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఫుడ్​ క్వాలిటీని చెక్​ చేయడానికి  ప్రిన్సిపాల్ తో పాటు ఒక టీచర్​ ఇన్​చార్జీగా ఉంటారు. వీళ్లు పట్టించుకోకపోవడంతో వంట చేసేవాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. స్కూల్స్, హాస్టల్స్ మెస్ లను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ర్యాండమ్​గా తనిఖీ చేసి శాంపిల్స్ తీసుకోవాలి. కానీ స్టాఫ్ కొరత వల్ల ఇది జరగడంలేదు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో  ఫుడ్‍ కల్తీ కంట్రోల్‍ చేయడానికి  కేవలం నలుగురు గెజిటెడ్‍ ఫుడ్​ఇన్​స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. మిగిలిన స్టాఫ్​ కూడా సరిపడా లేక తనిఖీలు చేయలేకపోతున్నారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు లేక చాలా జిల్లాల్లో మొదటి నుంచి తహసీల్దార్లే ఫుడ్​ క్వాలిటీని చెక్​ చేసే బాధ్యతలు చూస్తున్నారు. ధరణి అమలులోకి వచ్చాక తహసీల్దార్లు తనిఖీలను మరచిపోయారు. 

ఆదిలాబాద్​లో ఎక్కువ కేసులు.. 

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఫుడ్​ పాయిజనింగ్​ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.  గతేడాది ఫిబ్రవరి1న ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజ్ లో ఫుడ్ పాయిజన్ అయ్యి 23 మంది మెడికోలు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. నవంబర్ 5న నిర్మల్‌ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తి అప్పర్​ ప్రైమరీ స్కూల్​లో మిడ్​ డే మీల్స్​ తిని 32 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల బాసర ట్రిపుల్​ఐటీలో స్టూడెంట్స్​కు పెట్టిన బ్రేక్​ఫాస్ట్​లో కప్ప ప్రత్యక్షమైంది. ఆ తర్వాత వరుసగా రెండు రోజుల పాటు ఫుడ్​లో పురుగులను స్టూడెంట్స్​గుర్తించి సోషల్​మీడియాలో పెట్టారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ, దుర్కి, బాన్స్ వాడ మండలం ఇబ్రహీం పట్నం స్కూళ్లలో వరుసగా ఫుడ్​పాయిజనింగ్​ ఘటనలు జరిగాయి.  కారం, చింత పండు,  నూనె నాసిరకంగా ఉండడంవల్లే ఈ సమస్య వచ్చిందని అప్పట్లో ఆఫీసర్లు చెప్పారు.  ఫిబ్రవరి26న  హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లె ప్రైమరీ స్కూల్​లో  ఫుడ్ పాయిజనింగ్​జరిగి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అంగన్​వాడీ నుంచి తెచ్చి వండిన కందిపప్పు క్వాలిటీ లేకపోవడం వల్లే సమస్య వచ్చిందని ప్రాథమికంగా తేల్చారు.

నాసిరకం సరుకులు, పాడైన కూరగాయలు.. 

 స్కూళ్లలో, హాస్టళ్లలో స్టూడెంట్స్​ఇటీవల తరుచూ ఫుడ్​ పాయిజనింగ్​తో ఆస్పత్రుల పాలవుతున్నారు. నాసిరకం సరుకులు, పాడైన కురగాయలు, అపరిశుభ్రమైన కిచెన్లు ఇందుకు కారణమని చెబుతున్నారు. దీనికి తోడు పిల్లలకు క్వాలిటీ, క్వాంటిటీ ఫుడ్​ అందేలా చూడాల్సిన హెడ్మాస్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు.. కేజీబీవీల్లో సెక్టోరియల్ ఆఫీసర్లు  కనీసం స్కూళ్లు, హాస్టళ్లవైపు తొంగి చూడడం లేదు. దీంతో నిర్వాహకులు తమకు తోచినట్టు వండిపెడుతున్నారు. కొన్ని చోట్ల పగటి పూట వండిన ఫుడ్​నే రాత్రి పెడుతున్నారు. కిచెన్లు లేని స్కూళ్లలో వండిన ఆహారాన్ని బయటే ఉంచడం, మూతలు లేకపోవడంతో వాటిలో పురుగులు చేరుతున్నాయి. చెత్త పడుతోంది. మరికొన్ని చోట్ల వంటకు మంచినీటిని వాడటం లేదని, మార్కెట్లలో మిగిలిపోయిన కూరగాయలను తక్కువ రేటుకు కొని తెస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం పంపిస్తున్న బియ్యం కూడా నాసిరకంగా ఉంటోంది. బియ్యం సరిగా ఉడకక పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు.  గత డిసెంబర్ లో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని గురుకుల పాఠశాలకు సరఫరా అయిన  రైస్ ఉడకడం లేదని, దీంతో పిల్లలు కడుపునొప్పితో బాధ పడుతున్నారని ప్రిన్సిపాల్​ కంప్లయింట్​ చేశారు. దాంతో  81 క్వింటాళ్ల బియ్యాన్ని సివిల్ సప్లయీస్​ కార్పొరేషన్ మార్చి పంపించింది.  

ఆదిలాబాద్​లో ఒకే రోజు  రెండు చోట్ల ...​

ఆదిలాబాద్ : ఆదిలాబాద్​ జిల్లాలో బుధవారం ఒక్కరోజే రెండు చోట్ల టిఫిన్​, లంచ్ ​చేసిన విద్యార్థులు కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు.  ఆదిలాబాద్​లోని విద్యానగర్​లోని కేజీబీవీ హాస్టల్​లో ఉదయం ఇడ్లీ తిన్న 50 మంది స్టూడెంట్స్​అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి తట్టుకోలేకపోతున్నామని ఏడ్వడంతో సిబ్బంది హాస్పిటల్​కు తీసుకువెళ్లకుండా ఓఆర్ఎస్​ ఇచ్చి పడుకోబెట్టారు. విషయం తెలుసుకున్న మీడియా వచ్చి వారి వెహికల్స్​లో రిమ్స్​ దవాఖానాకు తీసుకుపోవాల్సి వచ్చింది. అలాగే తాంసి మండలం గోట్కూరి ప్రైమరీ స్కూల్​లో మధ్యాహ్న భోజనం చేసిన 28 మంది స్టూడెంట్స్ కడుపునొప్పితో వాంతులు చేసుకోగా రిమ్స్​హాస్పిటల్​కు తరలించారు. 

అడ్డాకులలో..

అడ్డాకుల, మహబూబ్‌నగర్‌‌ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్‌నగర్‌‌ జిల్లా అడ్డాకుల మండలం పెద్దమునిగల్​చెడు యూపీఎస్ స్కూల్‌లో బుధవారం మిడ్‌ డేమీల్స్‌ తిన్న 27 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది.  ‘అక్షయ పాత్ర’ సంస్థ పంపించిన భోజనాన్ని తిన్న కాసేపటికే 27 మందికి వాంతులయ్యాయి. కడుపునొప్పిగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయని టీచర్లకు చెప్పడంతో పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ మెడికల్ ఆఫీసర్ అందుబాటులో లేకపోవడంతో ఏఎన్ఎం, ఫార్మాసిస్ట్​ ట్రీట్‌మెంట్ చేశారు. 17 మందిని జిల్లా దవాఖానాకు తరలించారు.  

పెద్దపల్లి జిల్లాలో...

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం ప్రభుత్వ స్కూల్​నుంచి సా యంత్రం ఇంటికి వెళ్లిన 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని దవాఖానాకు తరలించగా 15 మందికి ట్రీట్​మెంట్​ఇచ్చి ఇంటికి పంపించారు. మిగతా 15 మందిని దవాఖానాలోనే అడ్మిట్​ చేసుకున్నారు. స్కూల్​లో తాగిన మంచినీళ్ల వల్లే ఇలా జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 కేజీబీవీ స్టూంటెడ్స్​ రాస్తారోకో

నర్సాపూర్ : రుచి లేని కూరలు, నీళ్లచారు తినలేకపోతున్నామని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్​ స్టూడెంట్స్​ ఆందోళనకు దిగారు. మూడుకిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి రెడ్డిపల్లి గేట్​దగ్గర మెదక్ –హైదరాబాద్ నేషనల్ హైవేపై బైఠాయించి రాస్తారోకో చేశారు. హాస్టల్​లో ఫుడ్​ బాగుండడం లేదని, కొన్నిసార్లు కారం వేసుకుని తింటున్నామన్నారు.  ట్రాఫిక్​ స్తంభించడంతో సీఐ వచ్చి విద్యార్థులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.