టెట్ అప్లికేషన్ల ఫీజు చెల్లింపులకు ముగిసిన గడువు

టెట్ అప్లికేషన్ల ఫీజు చెల్లింపులకు ముగిసిన గడువు
  • ఎడిట్ ఆప్షన్ ఇవ్వని సర్కార్
  • ఇప్పటికే 27 జిల్లాల్లో సెంటర్లు బ్లాక్..
  • గడువు పెంచాలని కోరుతున్న అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీఆర్టీ)కు భారీగా అప్లికేషన్లు వచ్చాయి. సోమవారం సాయంత్రం దాకా 6,04,035 దరఖాస్తులు అందాయి. ఫీజు చెల్లించే గడువు ఇప్పటికే ముగియగా.. దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారమే ఆఖరు. మరికొన్ని రోజులు దరఖాస్తు గడువు పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మాత్రం.. దరఖాస్తు గడువు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేస్తున్నారు.

16 రోజుల గడువే...

మార్చి 26 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 16 రోజులే గడువు ఇవ్వడంతో ఇంకా చాలామంది అప్లై చేసుకోలేకపోయారు. గడువు పెంచాలని అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. మరోపక్క అప్లికేషన్లలో తప్పుల సవరణకూ చాన్స్ ఇవ్వలేదు. దీంతో చివరి దాకా చూసి, కొందరు రెండోసారి అప్లై చేసుకున్నారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీకి వారికీ అవకాశమివ్వడంతో పేపర్1కు భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. పేపర్1కి 3,38,128, పేపర్ 2కి 2,65,907 అప్లికేషన్లు అందాయి. కానీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 3,65,148 మంది మాత్రమేనని ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రకటించారు. కొందరు రెండు సార్లు అప్లై చేయడం, పేపర్‌‌‌‌‌‌‌‌ 2కు దరఖాస్తు చేసిన వాళ్లలో చాలా మంది పేపర్‌‌‌‌‌‌‌‌ 1కు కూడా అప్లై చేయడంతో.. దరఖాస్తులు ఎక్కువగా, అభ్యర్థులు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్లికేషన్లు భారీగా రావడంతో సోమవారం 27 జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లను బ్లాక్ చేశారు. కేవలం జగిత్యాల, జనగామ, కరీంనగర్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లోనే పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. వారం క్రితమే హైదరాబాద్, దాని చుట్టుపక్కలున్న జిల్లాలను బ్లాక్ చేశారు. ఇలా సెంటర్లను బ్లాక్ చేయడం విమర్శలకు తావిస్తోంది.

గడువు పెంచాలె: ఏబీవీపీ

టెట్ అప్లికేషన్లకు గడువు పెంచాలని కోరుతూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేనను కలిసి వినతిపత్రం అందించారు. 2015 ముందు అభ్యర్థులకు మార్కుల నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు శ్రీహరి, నేతలు కమల్ సురేష్,  శ్రీకాంత్, శ్రీశైలం, ఝాన్సీ తదితరులున్నారు.