ఆసీఫాబాద్ జిల్లాలో స్టూడెంట్స్ ​లేక వెలవెలబోతున్న కేజీబీవీలు

ఆసీఫాబాద్ జిల్లాలో స్టూడెంట్స్ ​లేక వెలవెలబోతున్న కేజీబీవీలు
  • కేజీబీవీల్లో ఇంకా మొదలుకాని క్లాసులు
  • ఏం చదవాలి? ఏంతినాలంటున్న స్టూడెంట్స్​
  • ఇంటి వద్దే ఉంటున్న అమ్మాయిలు

ఆసిఫాబాద్,వెలుగు: ఆడపిల్లలు చదువు మధ్యలో మానేసి డ్రాపౌట్లుగా మారుతుండడంతో ప్రభుత్వం కేజీబీవీలు స్టార్ట్ చేసింది. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలేదు. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో కస్తూరిబా గాంధీ విద్యాలయాలు స్టూడెంట్స్​లేక వెలవెలబోతున్నాయి. జిల్లాలో మొత్తం 15 స్కూళ్లు ఉండగా 4,682 మంది  చదువుకుంటున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై 26 రోజులవుతున్నా.. ప్రభుత్వం సరుకులు, బుక్స్, మెటీరియల్​ పంపిణీ చేయకపోవడంతో చాలా మంది స్టూడెంట్లు ఏం తినాలి? ఏం చదవాలంటూ స్కూళ్లకు వెళ్లడంలేదు.

చదువు చెప్పేదెవరు?

కేజీబీవీల్లో విద్యాబోధన అంతంతే. చాలాచోట్ల అసలు సీఆర్టీలే లేరు. అరకొర వసతులు, అస్తవ్యస్థమైన మెనూ, సరైన సరుకుల సప్లయ్ చేసే దిక్కులేదు. చింతలమానేపల్లి కేజీబీవీలో మొత్తం 240 మంది స్టూడెంట్లు ఉండగా కేవలం నలుగురు స్టూడెంట్లే హాజరవుతున్నారు. కెరమెరిలో 262 మంది ఉండగా కేవలం 30 మందే స్కూల్​కు వస్తున్నారు. తిర్యాణి మండలం మాణిక్యపూర్​లో 125 మంది ఉండగా 16 మంది స్కూళ్లో ఉండలేక తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. దహెగాంలో 326 మంది స్టూడెంట్లకు గాను 9 మంది మాత్రమే స్కూల్​కు వస్తున్నారు.

సరుకులు సప్లై చేయక స్టూడెంట్లు రాలే

స్టూడెంట్లు వస్తే వండి పెట్టడానికి సరుకులు లేవు. అందుకే పిల్లలను స్కూళ్లకు రమ్మని చెప్పలేదు. సరుకులు సప్లై చేయడంలో జాప్యం చేయడంతో స్టూడెంట్లు స్కూల్ కు రాలేదు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. 
- రమాదేవి, ఎస్​వో,  కేజీబీవీ, దహెగాం

రెండు రోజుల్లో సరుకులు వస్తాయి..

కేజీబీవీలకు సరుకుల పంపిణీ టెండర్ లేట్ అయ్యింది. రెండు రోజుల క్రితం టెండర్ల ప్రక్రియ కంప్లీట్ చేశాం. త్వరలో సరుకులు అందేలా చూస్తాం. పిల్లలను స్కూళ్లకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
-  అశోక్, డీఈవో, ఆసిఫాబాద్