కేయూలో స్టూడెంట్స్​ కొట్లాట

కేయూలో స్టూడెంట్స్​ కొట్లాట

వరంగల్‍, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో సోమవారం రాత్రి రెండు స్టూడెంట్స్ వర్గాలు తన్నుకున్నాయి. కేయూ ఆఫీసర్లు, పోలీసులు ఈ విషయం బయటికి పొక్కకుండా మ్యానేజ్​ చేసినా అర్ధరాత్రి టైంలో మరోసారి ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. దాంతో పెద్దఎత్తున పోలీసులు క్యాంపస్​కు చేరుకుని స్టూడెంట్లను చెదరగొట్టారు. రాత్రంతా బందోబస్త్​ నిర్వహించారు. లాఠీచార్జ్​ను నిరసిస్తూ స్టూడెంట్స్​ మంగళవారం క్యాంపస్​లో నిరసన ర్యాలీ చేపట్టారు. 
అసలేం జరిగిందంటే..
సోమవారం రాత్రి 7గంటల ప్రాంతంలో యూనివర్సిటీలోని ఇంటిగ్రేటెడ్‍ కెమిస్ట్రీ, ఎంసీఏ స్టూడెంట్ల మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. డిన్నర్‍ చేసే హాస్టల్‍ వద్ద రెండు వర్గాల మధ్య మాటమాట పెరిగింది. తమ క్లాస్​మేట్‍ను కామెంట్‍ చేశారంటూ ఓ వర్గం స్టూడెంట్లు మరో వర్గం స్టూడెంట్లపై దాడికి దిగారు. కొట్లాట విషయం తెలుసుకున్న హాస్టల్‍ డైరెక్టర్‍తో పాటు రిజిస్ట్రార్‍ ఇతర ఆఫీసర్లు ఇరు వర్గాలను వారించి అక్కడి నుంచి పంపించారు. అంతా సద్దుమణిగింది అనుకున్న టైంలో రాత్రి10 గంటలకు రెండు గ్రూపుల స్టూడెంట్లు మళ్లీ మాటల యుద్ధం స్టార్ట్ చేశారు. రాళ్లు, కర్రలు, స్టీల్‍ బకెట్లు.. ఇలా ఏది దొరికితే అది తీసుకుని దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న కేయూ పోలీసులు అక్కడికి చేరుకుని చెదరగొట్టారు. అర్ధరాత్రి టైంలో కొందరు స్టూడెంట్లు పోలీసుల జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. సహనం కోల్పోయిన పోలీసులు పోతన హాస్టల్లోకి చేరి దొరికిన వారందరిపై లాఠీచార్జ్ చేశారు. పలువురు స్టూడెంట్లకు గాయాలయ్యాయి. అనంతరం ఏ ఒక్కరూ హాస్టల్‍ నుంచి బయటకు రాకుండా పెద్ద  సంఖ్యలో పోలీసులు మోహరించారు. పోలీసులు హాస్టల్‍ గదుల్లోకి వచ్చి లాఠీచార్జ్​చేయడాన్ని పీజీ స్టూడెంట్లు తప్పుపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా తప్పెవరిదో తెలుసుకుని శిక్షించాలని డిమాండ్‍ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం పోతన హాస్టల్‍ నుంచి వీసీ చాంబర్‍ వరకు ర్యాలీ తీశారు. మధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రెండు వర్గాల స్టూడెంట్లు పోలీస్‍ స్టేషన్‍ కు వెళ్లారని, వారి పేరెంట్స్​తో మాట్లాడి సమస్య పరిష్కరించనున్నట్లు కేయూ ఆఫీసర్లు చెప్పారు.