వేధింపులకు గురైన విద్యార్థినికి న్యాయం చేయాలి

వేధింపులకు గురైన విద్యార్థినికి న్యాయం చేయాలి
  •     ఇఫ్లూలో మళ్లీ రోడ్డెక్కిన స్టూడెంట్లు
  •     మెయిన్ గేట్ వద్ద ఆందోళన
  •     అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు

ఓయూ, వెలుగు :  ఇఫ్లూ(ది ఇంగ్లిష్ అండ్​ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) లో స్టూడెంట్లు మళ్లీ రోడ్డెక్కారు. గత నెలలో లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ సోమవారం స్టూడెంట్లు  యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమరణ దీక్ష చేసేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.

పోలీసులు  వారిని అరెస్టు చేసి ఓయూ, అంబర్​పేట పోలీసుస్టేషన్లకు తరలించారు. ఈ  సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ.. గతనెల18న క్యాంపస్​లో జాగింగ్​కు వెళ్లిన విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని, దీనిపై ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు నిందితులను గుర్తించలేదన్నారు.  దీనిపై అధికారులు సైతం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.  విద్యార్థినికి న్యాయం చేయాలని ఆందోళన చేసిన  11 మంది స్టూడెంట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు.  న్యాయం కోసం ఆందోళన చేసిన వారిపై కేసులు పెట్టిన పోలీసులు.. ఘటనకు కారణమైన నిందితులను గుర్తించడంలో మాత్రం శ్రద్ద చూపడం లేదన్నారు.  

సీసీ కెమెరాల ఫుటేజ్ క్లియర్​గా లేదంటూ పోలీసులు దాట వేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై వర్సిటీ అధికారులు నామమాత్రంగా ఎంక్వయిరీ కమిటీ వేసిందని  ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. కమిటీ చైర్​పర్సన్​ను తొలగించాలని వారు డిమాండ్​ చేశారు. ఆందోళనకు దిగిన 31 మంది స్టూడెంట్లపై కేసు నమోదు చేసిన పోలీసులు..  సొంత పూచీకత్తుపై వారిని వదిలిపెట్టారు. ఈ కేసులో బాధ్యులైన వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇఫ్లూ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ ఘటనపై ఎంక్వయిరీ కోసం ప్రత్యేక కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీని స్టూడెంట్లు తప్పుబట్టడం సరికాదన్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు స్టూడెంట్లు సంయమనం పాటించాలని అధికారులు కోరారు.