మల్లారెడ్డి కాలేజీ హాస్టల్ భోజనంలో బొద్దింక

మల్లారెడ్డి కాలేజీ హాస్టల్ భోజనంలో బొద్దింక
  • ఆందోళన చేపట్టిన స్టూడెంట్లు, విద్యార్థి సంఘాలు

దుండిగల్, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలోని హాస్టల్ భోజనంలో బొద్దింక వచ్చింది. సోమవారం రాత్రి దుండిగల్ లోని మెయిన్ బ్రాంచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. డిన్నర్ లో వడ్డించిన పప్పు తో పాటు మరో స్వీట్ లో విద్యార్థులు బొద్దింకను గుర్తించారు. వెంటనే ఇతర విద్యార్థులను  అలర్ట్​చేసి భోజనం చేయొద్దని సూచించారు. అనంతరం ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 భోజనం వండే వారిని ప్రశ్నించారు. కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నిదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు మహేశ్, దినేష్, రాజ్, ఎన్ఎస్ యూఐ నాయకులు రాఘవేందర్, రాధా కాలేజీకి చేరుకొని.. రాత్రి 11గంటల వరకు నిరసన తెలిపారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పి పంపించారు. మంగళవారం ఉదయం విద్యార్థులు కళాశాల ముందు మళ్లీ నిరసనకు దిగారు.

గత ఫిబ్రవరి నెలలో సైతం ఇలాంటి ఘటనే జరిగిందని, మళ్లీ పునరావృతం కావడంపై విద్యార్థులు మండిపడ్డారు. విద్యార్థులతో వచ్చిన కళాశాల బస్సులను బయటే నిలిపివేసి.. మేనేజ్మెంట్​బయటకురావాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న దుండిగల్ పోలీసులు స్పాట్​కు చేరుకొని విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులను యాజమాన్యంతో మాట్లాడించారు. దీంతో వారు నిరసనను విరమించారు.