భద్రాచలం గిరిజన గురుకులంలో పురుగుల కిచిడీ.. నిరసన తెలిపిన స్టూడెంట్లు

భద్రాచలం గిరిజన గురుకులంలో పురుగుల కిచిడీ.. నిరసన తెలిపిన స్టూడెంట్లు
  • భద్రాచలం గిరిజన గురుకులంలోఘటన

భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల బాలికల కాలేజీలో శనివారం పురుగులతో కూడిన కిచిడీని తినకుండా స్టూడెంట్లు నిరసన తెలిపారు. మూడు రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని వారు ప్రిన్సిపాల్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే కిచిడీలో పురుగులు రావడంతో 600 మంది స్టూడెంట్లు టిఫిన్​ తినకుండానే క్లాసులకు అటెండ్​అయ్యారు. స్టూడెంట్ల కోసం 80 కిలోల కిచిడీని తయారు చేశారు. కేవలం ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు.

పురుగుల బియ్యం వచ్చినా వాటిని వెనక్కు పంపించకుండా తమకు పెట్టి వదిలించుకునేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇకపై పురుగుల అన్నం తినలేం, అందుకే తినకుండా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు. కాగా జీసీసీ నుంచి పురుగుల బియ్యం వచ్చిన మాట వాస్తవమేనంటూ ప్రిన్సిపాల్​ పేర్కొన్నారు. వాటిని వెనక్కు పంపించామని తెలిపారు. ఈ ఘటనపై ఐటీడీఏ పీవో బి.రాహుల్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. గురుకులం ఆర్సీవోను విచారణాధికారిగా నియమించారు. నిర్లక్ష్యంగా ఎవరు ఉన్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.