ఓయూ, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనకు జరిగే ఉద్యమంలో విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించాలని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఓయూలో బీసీ విద్యార్థి జేఏసీ తలపెట్టిన దీక్షకు గురువారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నూకల మధు యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు.
కేంద్రం శీతాకాల పార్లమెంట్ సమావేశాలక్లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్, బీసీ జేఏసీ కోచైర్మన్ గుజ్జ సత్యం, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కోఆర్డినేటర్ అరుణ్ కుమార్, బీసీ రాజ్యాధికార సమితి ఫౌండర్ దాసు సురేష్ పాల్గొన్నారు.
అన్యాయం జరిగితే ఊరుకోం..
ముషీరాబాద్: 78 ఏండ్లుగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఇక ఊరుకునేది లేదని బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై గురువారం సైనిక్‌పురిలో బీసీ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం దోమలగూడలో గణేశ్‌చారి మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లు విషయంలో నిర్లక్ష్యం చేస్తే కేంద్రంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో శంకర్ గౌడ్, మారోజు సోమాచారి, తాటికొండ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ సవరణ చేయాల్సిందే..
అంబర్‌పేట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. గురువారం అంబర్‌పేట ఆలీ కేఫ్ చౌరస్తాలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం ఎదుట బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. జేఏసీ కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్ గౌడ్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు హాజరై మాట్లాడారు. రాజ్యాంగ సవరణ చేసి, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చితేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమన్నారు. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. జేఏసీ ప్రతినిధులు కనకాల శ్యాం కుర్మ, డాక్టర్ పురుషోత్తం, శేఖర్ సగర, కేపీ మురళీకృష్ణ పాల్గొన్నారు.
