లబ్ధిదారుల లిస్టు ఇస్తేనే డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధులు

లబ్ధిదారుల లిస్టు ఇస్తేనే డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం నిధుల విషయంలో కేంద్రం ఆంక్షలు పెడుతోంది. ఈ పథకం కోసం కేంద్రం నుంచి రెండు, మూడు దశల కింద రావాల్సిన రూ.1,800 కోట్లను విడుదల చేసేందుకు ససేమిరా అంటోంది. 8 నెలలుగా నిధులు విడుదల చేయాలని కోరుతున్నా… ఇచ్చేది లేదంటోంది. అంతేకాదు లబ్ధిదారుల జాబితా ఇస్తేనే నిధులు ఇస్తామని తేల్చిచెబుతోంది. డబుల్ బెడ్రూం ఇళ్లకు మొదటి విడతలో రూ.1200 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం రెండు, మూడు విడతల్లో మాత్రం నిధుల విడుదలకు అభ్యంతరాలు చెబుతోంది.

ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటికి దాదాపు రూ. 9 లక్షలు ఖర్చవుతుండగా…కేంద్రం తన వంతుగా లక్షన్నర రూపాయలు ఇస్తోంది. దీని ప్రకారం GHMC పరిధిలో నిర్మిస్తున్న లక్ష ఇళ్లకు కేంద్రం నుంచి ఇంకా రూ.1500 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో మొదటి విడత కింద రూ.600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇంకా రూ.900 కోట్లతోపాటు ఇతర జిల్లాలో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి మరో రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడీ నిధుల విడుదల విషయంలో మెలిక పెడుతూ లబ్ధిదారుల లిస్టును తీసుకురావాలంటోంది. లిస్టును ఇస్తేనే నిధుల విడుదల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేస్తోంది

మరోవైపు కేంద్ర ప్రభుత్వం వాదనను తెలంగాణ ప్రభుత్వం తప్పుబడుతోంది. నిర్మాణంలో ఉండగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తే అది అనవసర సమస్యలకు దారి తీస్తుందని చెబుతోంది. లబ్ధిదారులను ముందుగానే ఎంపిక చేయడంతో ఒత్తిళ్లు పెరగడంతోపాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందంటోంది.