సబ్సిడీ గొర్రెలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌: ఉద్రిక్తంగా మారిన గొల్లకుర్మల రణభేరి

సబ్సిడీ గొర్రెలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌: ఉద్రిక్తంగా మారిన గొల్లకుర్మల రణభేరి

బీజేపీ ఆధ్వర్యంలో మెదక్​లో చలో కలెక్టరేట్..
సబ్సిడీ గొర్రెలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌
ర్యాలీకి అడుగడుగునా పోలీసుల ఆటంకాలు
బారికేడ్లు, తాళ్లతో అడ్డుకోవడంతో తోపులాట
బీజేపీ లీడర్లు, గొల్లకుర్మల అరెస్ట్

మెదక్, మెదక్ టౌన్, వెలుగు: సబ్సిడీ గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలన్న డిమాండ్​తో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో మెదక్ లో చేపట్టిన గొల్లకుర్మల రణభేరి రణరంగంలా మారింది. కలెక్టరేట్ ముట్టడి కోసం ర్యాలీగా వెళ్తున్న వేల మంది గొల్లకుర్మలు, బీజేపీ లీడర్లు, కార్యకర్తలకు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుతగలడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో పోలీసులు లాఠీచార్జికి కూడా దిగడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. చివరికి పోలీసులు బీజేపీ ముఖ్య నేతలను, గొల్లకుర్మలను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్​స్టేషన్లకు తరలించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న గొల్లకుర్మలను అడ్డుకోవడం దారుణమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్​ ప్రెసిడెంట్ కె.లక్ష్మణ్​మండిపడ్డారు.

అడుగడుగునా..

సబ్సిడీ గొర్రెల పంపిణీ స్కీం అమల్లో జాప్యం, అవినీతి, అక్రమాలను నిరసిస్తూ, ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ..శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో మెదక్​టౌన్​లో గొల్లకుర్మల రణభేరి ఆందోళన నిర్వహించారు. ముందు ఇక్కడి జీకేఆర్​ గార్డెన్స్​లో సభ నిర్వహించారు. కె.లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు, మెదక్​ మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేల మంది గొల్లకుర్మలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్​కు ర్యాలీగా బయలు దేరారు. ఈ విషయం తెలిసి మెదక్, తూప్రాన్​ డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్సైల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. వ్యవసాయ మార్కెట్ కమాన్​ వద్ద రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టారు. ర్యాలీ ముందుకు వెళ్లడానికి వీల్లేదని అడ్డుకున్నారు. అందరూ మార్కెట్​ యార్డులోకి వెళ్లాలని హెచ్చరించారు. కానీ గొల్లకుర్మలు, బీజేపీ లీడర్లు వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే రోడ్డు మీద బైఠాయించారు. మరికొందరు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని బారికేడ్లు, తాళ్లతో అడ్డుకోవడంతో తోపులాట జరిగి.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకదశలో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. లక్ష్మణ్, రఘునందన్​రావు, శశిధర్​రెడ్డి, గడ్డం శ్రీనివాస్, ఇతర నేతలను బలవంతంగా గుంజుకపొయి వెహికల్స్​లో ఎక్కించి కొల్చారం పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఇతర నేతలను చిన్నశంకరంపేట పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర చీఫ్​ ఆలె భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత మల్లేశం యాదవ్​ను, కొందరు కార్యకర్తలు, గొల్లకుర్మలు పోలీసు నిర్బంధం నుంచి తప్పించుకొని ముందుకెళ్లారు. వెల్​కం బోర్డు చౌరస్తాలో అరగంట సేపు బైటాయించారు. తర్వాత ఆలె భాస్కర్​ ఆధ్వర్యంలో ఐదుగురు నాయకులు కలెక్టరేట్​ కు వెళ్లి గొల్లకుర్మల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్​ హరీశ్​కు అందజేశారు.

గొల్లకుర్మల డిమాండ్లు తీర్చాల్సిందే: కె.లక్ష్మణ్

గొల్లకుర్మల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ర్యాలీ తీస్తే పోలీసులు అడ్డుకోవడం దారుణమని ​కె.లక్ష్మణ్​ అన్నారు. టీఆర్ఎస్​ పాలనలో తీవ్ర అన్యాయానికి గురవుతున్న బీసీలను ఏకతాటిపైకి తెస్తామని, రాష్ట్రంలో గడీల రాజ్యాన్ని బద్దలు కొడతామని స్పష్టం చేశారు. నేత, గీత, మత్స్య కార్మికులు, గొల్లకుర్మలు తదితర సబ్బండ వర్గాల వారు తెలంగాణ సాధన కోసం పోరాడితే.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నది ఒక్క కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనని మండిపడ్డారు. ‘‘కేసీఆర్​ సీఎం అయిండు, కేటీఆర్, హరీశ్​రావులను మంత్రులు చేసిండు, సంతోష్​రావును ఎంపీ చేసుకున్నరు, ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన కవితను ఎమ్మెల్సీ చేసుకున్నరు. అసలు వయసు లేదని ఊరుకున్నరుగనీ బుడ్డోడి (కేటీఆర్​ కొడుకు)కి కూడా మంత్రి పదవి ఇచ్చేవారు” అని కామెంట్​ చేశారు. డీడీలు కట్టిన గొల్లకుర్మలందరికీ నేరుగా యూనిట్​కాస్ట్​ లక్షా 20 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.