
ఖర్తూమ్ : ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభాల్లో కూరుకుపోయిన సూడాన్ ను ఇప్పుడు సైనిక సంక్షోభం వణికిస్తోంది. సైనిక స్థావరాలపై పట్టు కోసం సూడాన్ ఆర్మీ, పారా మిలటరీ బలగాల్లోని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) మధ్య శనివారం నుంచి భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఇళ్లలో నుంచి బయటకు రావట్లేదు. రాజధాని ఖర్తూమ్తో పాటు ఓందుర్ మన్, పశ్చిమ డార్ఫర్ ప్రావిన్స్, ఉత్తర డార్ఫర్ ప్రావిన్స్, కస్సాలా ప్రావిన్స్, అల్ ఖదారిఫ్ ప్రావిన్స్‌లలో సూడాన్ ఆర్మీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య తుపాకులు, యుద్ధ ట్యాంకులతో పోరు జరుగుతోంది. ఈ రెండు సైనిక వర్గాలు ఒకదాని స్థావరాలను మరొకటి టార్గెట్ చేసుకొని దాడులు చేసుకుంటున్నాయి.
ఈ దాడుల్లో 56 మంది పౌరులు మృతిచెందగా, 600 మందికిపైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఆల్బర్ట్ అగస్టీన్ అనే భారతీయుడు ఉన్నట్లు గుర్తించారు. శనివారం బుల్లెట్ గాయాలతో అతడు మృతిచెందాడని ఖర్తూమ్ లోని భారత ఎంబసీ ట్వీట్ చేసింది. మృతుడి స్వస్థలం కేరళలోని కన్నూర్ అని వెల్లడించింది. అగస్టీన్ మృతదేహాన్ని కేరళకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. ఈనేపథ్యంలో సూడాన్‌లో ఉంటున్న భారతీయులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని భారత ఎంబసీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
ఆ ప్రతిపాదన వల్లే..
ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్)ను సూడాన్ ఆర్మీలో విలీనం చేసేందుకు ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫత్తా బుర్హాన్ చేసిన ప్రతిపాదన ఈ అంతర్యుద్ధానికి దారితీసింది. సైన్యంలో తమ గ్రూప్‌ను విలీనం చేయరాదంటూ మహ్మద్ హమ్దాన్ దగాలో నేతృత్వంలోని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ తిరుగుబాటు చేశాయి. మరోవైపు అంతర్గత యుద్ధాన్ని ఆపాలంటూ సూడాన్‌కు అమెరికా, యూరోపియన్ యూనియన్, అరబ్‌లీగ్, ఆఫ్రికన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విజ్ఞప్తి చేశాయి. కనీసం అంబులెన్సులు, మందుల సరఫరా వాహనాలపై దాడులు చేయకుండా సూడాన్ ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్లను ఒప్పించాలంటూ సూడాన్ డాక్టర్ల సమాఖ్య అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.