
- తొలి స్పీచ్‌లో ప్రభుత్వానికి ఎంపీ సుధామూర్తి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: రచయిత్రి, ఎంపీ సుధామూర్తి రాజ్యసభలో చేసిన తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. మహిళా ఆరోగ్యంపై బుధవారం ఆమె మాట్లాడారు. దీనిపై రాజ్యసభకు వచ్చిన మోదీ స్పందించారు. విమెన్ హెల్త్‌పై మాట్లాడిన సుధామూర్తిని ప్రశంసించారు. విమెన్స్ డే సందర్భంగా రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడుతూ.. సర్వైకల్ క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు భారత సర్కారు చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ను ప్రస్తావించారు. ‘‘9–14 ఏండ్ల మధ్య వయస్సుగల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ టీకాలు ఇస్తుంటారు.
ఆ టీకాను గర్ల్స్ తీసుకుంటే క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు. చికిత్స కంటే నివారణే ఉత్తమం కాబట్టి.. బాలికలకు భవిష్యత్తులో క్యాన్సర్రాకుండాఈ టీకా అందేలా ప్రమోట్ చేయాలి” అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తన తండ్రి చెప్పిన ఓ కొటేషన్‌ను గుర్తు చేశారు. “కుటుంబంలో తల్లి చనిపోతే దవాఖాన లెక్కల్లో ఒకరు మృతిచెందినట్టు.. కానీ.. ఆ ఫ్యామిలీకి మాత్రం తీరని లోటు” అని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో భారత సర్కారు అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిందని, 9–14 ఏండ్ల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ టీకాలు వేయడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు.
సుధామూర్తికి మోదీ కృతజ్ఞతలు
తన ప్రసంగంలో మహిళా ఆరోగ్యం, వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి మాట్లాడినందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం 10 ఏండ్ల నుంచి ప్రాధాన్య రంగంగా విమెన్ హెల్త్, సానిటేషన్పై ప్రత్యేక దృష్టిపెట్టిందని చెప్పారు. మహిళల కోసం ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించినట్టు వివరించారు. శానిటరీ ప్యాడ్స్ అందజేశామని, గర్భిణులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.