చైతూ నుంచి ఆ మాట రావడం ఆనందంగా ఉంది

చైతూ నుంచి ఆ మాట రావడం ఆనందంగా ఉంది

సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడీగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. బెంచ్‌మార్క్ స్టూడియోస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలవుతున్న నేపథ్యంలో హీరో సుధీర్ బాబు మీడియాతో సినిమా గురించి పలు విషయాలు పంచుకున్నారు. 


దర్శకుడు ఇంద్రగంటి గారితో ఇది మూడో చిత్రం. మీ కాంబినేషన్, ఆయనతో మీ ప్రయాణం గురించి చెప్పండి?

 
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్ లో ఒక ఒక డైలాగ్ వుంది. 'మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం. కానీ సినిమానే మనల్ని తీస్తుంది' అని. వాస్తవానికి మా కాంబినేషన్ వల్ల ఈ సినిమా జరగలేదు. సినిమానే మమ్మల్ని ఎంపిక చేసుకుంది. ఆయన నన్ను యాక్టర్ గా నమ్మారు. నేను ఆయన కథల్ని నమ్మాను. ఆయన ఒక కాంబినేషన్ ని సెట్ చేసుకోవాలనుకునే దర్శకుడు కాదు. ఒక హిట్ ఇచ్చిన వెంటనే ఒక పెద్ద స్టార్ కోసం ఎదురుచూస్తారు. కథలు రాస్తారు. కానీ ఆయన మాత్రం ఒక కథని రాసుకొన్న తర్వాత దానికి ఎవరు నప్పుతారో చూస్తారు. ఆయన నాతో సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

సమ్మోహనంలో సినిమా నేపథ్యం ఉంటుంది కదా... ఇందులో కూడా సినిమా నేపథ్యం. రెండింటికి ఏమైనా పోలికలు ఉన్నాయా ?

లేదండీ... సినిమా నేపథ్యం అనే మాటే కానీ రెండు సినిమాలకి ఎలాంటి పోలిక లేదు. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చాలా ఫ్రెష్ గా ఉంటుంది. సమ్మోహనంలో సంఘర్షణ అమ్మాయి,అబ్బాయి మధ్యనే ఉంటుంది. ఈ చిత్రంలో కుటుంబాల మధ్య సంఘర్షణ ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చూస్తే మీకే అర్ధమైపోతుంది.

 ట్రైలర్ లో మీ పాత్ర ఎమోషనల్ గా కనిపించింది కదా.. సినిమాలో ఎలా ఉండబోతుంది ?

ఇంద్రగంటి సినిమాల్లో ఎమోషన్ చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ పాత్రలతో ప్రయాణిస్తారు. ఇందులో కమర్షియల్ సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపిస్తా. ఆ పాత్రకి కొంచెం తిక్క, భిన్నమైన అభిరుచి ఉంటుంది. కమర్షియల్ సినిమా కూడా గొప్ప పర్పస్ కోసం తీస్తామని ప్రోజెక్ట్ చేయడం జరిగింది. ఇంద్రగంటి ఈ పాత్రని

 చాలా వైవిధ్యంగా డిజైన్ చేశారు.

వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి చెప్పండి ?

ఇంద్రగంటి- వివేక్ సాగర్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఇంద్రగంటి సినిమాల్లో ఇంట్రో సాంగ్, ఐటెం సాంగ్ సాధారణంగా ఉండవు. అయితే ఈ కథలో నా పాత్ర కమర్షియల్ డైరెక్టర్ అవ్వడం వలన ఆ అవకాశం వచ్చింది. ఐటెం సాంగ్ చేయడం వివేక్ సాగర్ కి కూడా కొత్త. వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలు, నేపధ్య సంగీతం అన్నీ అద్భుతంగా ఉంటాయి.

ఇంద్రగంటి సినిమాల్లో హీరోయిన్ కి ప్రాధన్యత ఉంటుంది. ఇందులో కృతిశెట్టి పాత్ర ఎలా ఉండబోతుంది ?

ఉప్పెనకి ముందే కృతిశెట్టిని ఎంపిక చేశాం. చాలా మంచి నటి. ఒక పాత్రని అర్ధం చేసుకోవడంలో చాలా పరిణతి కనబరుస్తుంటుంది. ఉప్పెనతో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాతో ఏ పాత్రైనా చేయగలననే నమ్మకం కలిగిస్తుందని భావిస్తున్నా. శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

ఇంద్రగంటి కథలు చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయి కదా.. ఇందులో ఎలా ఉంటుంది ?

కథపరంగా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆయన ఇంత ఎమోషనల్ టచ్ చేసిన సినిమాలు లేవు. ఇంద్రగంటి ప్రజెంటింగ్ స్టయిల్ ఉంటుంది. ఎక్కువ సినిమా స్వేచ్ఛ తీసుకోకుండా, ఫెర్ఫార్మెన్స్ చాలా రియల్ గా ఉంటాయి. డైలాగ్స్ నేచురల్ గా ఉంటాయి. పాత్రలు మనచుట్టూ ఉన్నట్లే ఉంటాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూనే ఎమోషనల్ గా ఒక డిఫరెంట్ కథ, ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటాయి.

నిజజీవితంలో దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందా ?

నేను చాలా మంది కొత్త దర్శకులతో పనిచేశా. నాకు తెలియకుండానే దర్శకులు చేసే కొన్ని పనులు చేశాను. తప్పని పరిస్థితులు ఏవో సీన్స్, డైలాగ్స్ రాయడం, షూటింగ్ చూసుకోవడం వంటి పనులు చేయడంతో అనుకోకుండానే దర్శకత్వం వైపు ఒక ఆసక్తి ఏర్పడింది. అయితే దర్శకత్వం ఎప్పుడు చేస్తానో తెలీదు. ఇప్పటికైతే నా దృష్టి నటనపైనే ఉంది.

నిర్మాతలు మహేంద్రబాబు, కిరణ్ గురించి..

వారికి ఇండస్ట్రీలో అనుభవం ఉంది. సినిమా పరిశ్రమ, ఇక్కడ బిజినెస్ గురించి తెలిసినవాళ్ళు. ఎక్కడా రాజీపడకుండా ఒక క్వాలిటీ సినిమాని తీశారు. వారికీ బ్యానర్ కి ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది.

 ట్రైలర్ లో విజువల్స్ చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి కదా.. డీవోపీ పీజీ విందా గురించి ?

'సమ్మోహనం' సినిమాకి కలిసి పని చేశాం. ఆ సినిమా కంటే మరో మెట్టులో ఉంటుంది. చాలా విజువల్ బ్యూటీ ఉంటుంది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య మీకు' ఆల్ రౌండర్' అని కితాబిచ్చారు కదా ?

నాగచైతన్య నా ఫస్ట్ హీరో. చాలా పాజిటివ్ పర్సన్. చైతూతో మాట్లాడుతున్నప్పుడు చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. చైతూ నుంచి ఆ మాట రావడం చాలా ఆనందంగా ఉంది.

ఒక నటుడిగా మీ ఎదుగుదల ఎలా అనిపిస్తుంటుంది ?

నటుడిగా తృప్తిగా ఉన్నాను. మంచి పాత్రలు ఎంచుకోవడం, అవి ప్రేక్షకులకు నచ్చడం ఆనందంగా ఉంది.

 బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయా ?

వస్తున్నాయి. బ్రహ్మాస్త్ర మూవీ టీం నుంచి కూడా వచ్చింది. కానీ ఆ సమయంలో ‘సమ్మోహనం’ చేస్తున్నా. అలాగే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చర్చల్లో ఉండటం వలన చేయడం కుదరలేదు.

కొత్తగా చేయబోతున్న చిత్రాలు..

హంట్, మామా మశ్చీంద్ర, యూవీ క్రియేషన్స్ సినిమా, అలాగే సెహరి దర్శకుడు జ్ఞానసాగర్ తో ఓ సినిమా చేస్తున్నా. మామామశ్చీంద్ర ఇంకో ఇరవై రోజులు షూట్ ఉంది. హంట్ సినిమాకి మార్వెల్ సిరిస్ కి చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ పని చేశారు.

ఎప్పుడూ సిక్స్ ప్యాక్ తో ఉండటం ఎలా సాధ్యపడుతుంది ?

చాలా మంది ఇదే విషయాన్ని అడుగుతుంటారు.  దీని కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని లాంచ్ చేస్తున్నా.

మహేష్ బాబు ఈ సినిమా చూశారా ?

రేపు ఉదయమే అందరం చూస్తాం.