కరోనా పేషెంట్లకు షుగర్ ముప్పు!

కరోనా పేషెంట్లకు షుగర్ ముప్పు!
  • వైరస్ ఎటాక్‌ తో దెబ్బతింటున్న బీటాసెల్స్‌
  • ఇన్సులిన్ తగ్గి షుగర్ లెవల్స్ పెరుగుతున్నయ్‌
  • స్టెరాయిడ్స్ వినియోగంతోనూ ప్రమాదమే..
  • ప్రీడయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నోళ్లకు ఎక్కువ రిస్క్‌

హైదరాబాద్‌‌, వెలుగుకరోనా వైరస్‌‌ కొత్త హెల్త్‌‌ ప్ల్రాబ్లమ్స్‌‌ తెచ్చిపెడుతోంది. ఇప్పటికే చాలా మంది కరోనా నుంచి కోలుకున్నా, లంగ్స్‌‌పై అది చూపిన ఎఫెక్ట్‌‌ నుంచి మాత్రం కోలుకోవడం లేదు. ఇప్పుడు వైరస్ వల్ల డయాబెటిస్‌‌ ముప్పు కూడా ఏర్పడుతోంది. వైరస్ ఎటాక్‌‌తో డయబెటిస్‌‌ లేనోళ్లలోనూ షుగర్‌‌‌‌ లెవల్స్‌‌ పెరుగుతున్నాయి. లంగ్స్‌‌లోకి చొరబడుతున్నట్టే, కొంత మందిలో పాంక్రియాస్‌‌పై కూడా కరోనా ఎటాక్‌‌ చేస్తోంది.ఇది షుగర్ లెవల్స్‌‌ పెరగడానికి కారణమవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. పాంక్రియాస్‌‌లో ఇన్సులిన్‌‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలు ఉంటాయి. వైరస్‌‌ ఈ కణాల్లోకి చొరబడి, వాటిని నాశనం చేస్తోంది. దీంతో ఇన్సూలిన్‌‌ ఉత్పత్తి తగ్గిపోవడం, లేదా ఆగిపోవడం జరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో బ్లడ్‌‌లో చక్కెర లెవల్స్‌‌ పెరుగుతున్నయి. అయితే, కొందరిలోనే ఇలా అవడానికి కారణం ఏంటన్నదానిపై డాక్టర్లు ఇప్పటికీ స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నారు. వైరస్ మన కణాల్లోకి చొరబడటానికి మన బాడీలో ఉండే ఏసీఈ2 రెసిప్టర్స్‌‌ను వాడుకుంటోంది. ఈ రెసిప్టర్స్‌‌ పాంక్రియాస్‌‌ వద్ద కూడా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. వీటి సాయంతోనే పాంక్రియాస్‌‌లోకి చొరబడి అక్కడి సెల్స్‌‌పై వైరస్‌‌ ఎటాక్ చేస్తున్నట్టు భావిస్తున్నారు.

మెడిసిన్స్‌‌తోనూ ముప్పే

కరోనా పేషెంట్లకు ఇస్తున్న కొన్ని రకాల మందుల వల్ల కూడా షుగర్ లెవల్స్‌‌ పెరుగుతున్నయి. ముఖ్యంగా డెక్సామిథసోన్‌‌, మిథైల్‌‌ ప్రెడ్నోసోలోన్‌‌ వంటి కార్టికో స్టెరాయిడ్స్‌‌ వినియోగంతో షుగర్ పెరుగుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. వీటిని వాడినప్పుడు ఏర్పడే హార్మోన్ల అసమతుల్యత, ఇమ్యునిటీ లెవల్స్‌‌ తగ్గిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్‌‌ ఇందుకు కారణమమవుతున్నాయి. వాస్తవానికి పరిస్థితి సీరియస్‌‌గా ఉన్న పేషెంట్లలో మాత్రమే కార్టికో స్టెరాయిడ్స్‌‌ వినియోగించాలని డాక్టర్లు చెబుతున్నారు. ఆక్సిజన్ లెవల్స్‌‌ పడిపోతే తప్ప స్టెరాయిడ్స్ వాడొద్దని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సూచించింది. కానీ, గ్రౌండ్‌‌ లెవల్లో మాత్రం మైల్డ్, మోడరేట్ సింప్టమ్స్ ఉన్న పేషెంట్లకూ వీటిని ఇస్తున్నారు. మరికొంతమంది సొంతంగానే వీటిని కొని వేసుకుంటున్నారు. ఈ అనవసర వాడకంతో  షుగర్ లెవల్స్ పెరుగుతున్నయి. ముఖ్యంగా, డయబెటిక్‌‌ పేషెంట్లకు, ప్రీడయబెటిక్‌‌ స్థితిలో ఉన్నోళ్లకు స్టెరాయిడ్స్‌‌ వినియోగంతో వెంటనే షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోతున్నట్టు క్రిటికల్ కేర్ ఎక్స్‌‌పర్ట్‌‌, డాక్టర్ కిరణ్‌‌ తెలిపారు. షుగర్ లెవల్స్‌‌ పెరగడంతో ఇమ్యునిటీ తగ్గిపోయి, వైరస్ ఎటాక్‌‌ మరింత పెరుగుతోందని ఆయన వివరించారు.

చాలా జాగ్రత్తలు అవసరం

కరోనా పేషెంట్లలో షుగర్‌‌‌‌ లెవల్స్‌‌ పెరగడానికి రకరకాల కారణాలున్నయి. బీటా సెల్స్‌‌పైన వైరస్ ఎటాక్ చేయడం, స్టెరాయిడ్స్‌‌ వినియోగం, ఇమ్యునిటీ లెవల్స్ పడిపోవడం.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో కారణం ఉంటోంది. కొంతమందైతే షుగర్ విపరీతంగా పెరిగిపోయి ‘డయబెటిక్ కీటో ఎసిడోటిస్‌‌’ స్టేజ్‌‌లోకి వెళ్లి మరణిస్తున్నారు. కారణమేదైనా షుగర్‌‌‌‌ లెవల్స్‌‌ను కంట్రోల్ చేయకుండా కరోనా పేషెంట్లను స్టేబుల్ చేయలేం. స్టెరాయిడ్స్‌‌ వాడేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మైల్డ్‌‌, మోడరేట్ సింప్టమ్స్ ఉంటే, స్టెరాయిడ్స్ అస్సలు వాడొద్దు. స్టెరాయిడ్స్‌‌, వైరస్ ఎటాక్‌‌తో పెరిగిన షుగర్ లెవల్స్‌‌ మళ్లీ తగ్గుతయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

– డాక్టర్ కిరణ్‌‌ మాదాల, క్రిటికల్ కేర్ ఎక్స్‌‌పర్ట్‌‌, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నిజామాబాద్