గజ్వేల్​ నియోజకవర్గంలో చెరుకు రైతుల నామినేషన్

గజ్వేల్​ నియోజకవర్గంలో చెరుకు రైతుల నామినేషన్

సిద్దిపేట, వెలుగు :  జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి చెందిన చెరుకు రైతులు బద్దం శ్రీనివాస్ రెడ్డి, మామిడి నారాయణ రెడ్డి, నవనంది లింబారెడ్డి బుధవారం గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి  నామినేషన్లు వేశారు. వారు మాట్లాడుతూ చెరుకుతోపాటు రైతాంగ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ చొరవ చూపలేదని గజ్వేల్​లో ఆయనను ఓడించడానికి నామినేషన్లు వేసినట్టు చెప్పారు.

జాయింట్ వెంచర్ లో నడుస్తున్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ..కేసీఆర్ సీఎం అయిన తర్వాత మూతపడిందని, దీంతో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.చెరుకును సమీపంలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి తరలించడం వల్ల టన్నుకు రూ.500 అదనంగా ట్రాన్స్ పోర్ట్ ఖర్చతవుతోందన్నారు. దీనివల్ల 8 ఏండ్లలో రూ.40 కోట్లు నష్టపోయామన్నారు. ముత్యంపేట ఫ్యాక్టరీని తెలంగాణ రైతులే నడిపే విధంగా చూస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినా నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడు చెరుకు ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నారు. వీరితో పాటు మల్లన్న సాగర్ నిర్వాసితులు గజ్వేల్ స్థానానికి నామినేషన్లు వేశారు.