పెండ్లి వేడుకలో సూసైడ్ బాంబర్ దాడి..మాజీ మిలిటెంట్ టార్గెట్ గా అటాక్

పెండ్లి వేడుకలో సూసైడ్ బాంబర్ దాడి..మాజీ మిలిటెంట్ టార్గెట్ గా అటాక్
  • పాక్​లో ఏడుగురు దుర్మరణం
  • మరో 25 మందికి తీవ్ర గాయాలు
  • ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో ఘోరం

ఇస్లామాబాద్: పాకిస్తాన్​లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో బాంబు పేలి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ  బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు.. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాకు చెందిన కమ్యూనిటీ లీడర్ నూర్ ఆలం మెహసూద్ ఇంట్లో సూసైడ్ అటాక్ జరిగింది. 

వేడుకల్లో భాగంగా అతిథులు డ్యాన్స్ చేస్తుండగా ఉన్నట్టుండి సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో పెళ్లింట తీవ్ర గందరగోళం నెలకొంది. పేలుడు ధాటికి పైకప్పు కూలిపోగా.. లోపల మొత్తం దుమ్ము, పొగ కమ్మేసింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను వెలికి తీయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ఈ దాడికి ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. 

అయితే, ఈ దాడి తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పెళ్లికి హాజరైన మాజీ మిలిటెంట్ ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సూసైడ్ అటాక్ జరిగిందని చెబుతున్నారు. మాజీ మిలిటెంట్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఈ పేలుడులో మరణించారని తెలిపారు.