ఇద్దరు కొడుకులతో కలిసి సచ్చిపోతున్నానంటూ సెల్ఫీ
సెల్ సిగ్నల్ ఆధారంగా కాపాడిన పోలీసులు
అమ్రాబాద్, వెలుగు: ఇద్దరు చిన్నారులతో కలిసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వ్యక్తి చేసిన సెల్ఫీ వీడియో నల్లమలలో కలకలం రేపింది. అమ్రాబాద్ సీఐ బీసన్న తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి గ్రామానికి చెందిన హరిశంకర్ తన ఇద్దరు కొడుకులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నానని మన్ననూర్ దుర్వాసుల చెరువు సమీపంలో చెక్ పోస్టు పరిధి 1వ సిట్టింగ్ పాయింట్ వద్ద ఒక సెల్ఫీ వీడియో తీశాడు. పంట పొలాల్లో వేసే పురుగుల మందు డబ్బాను, టిఫిన్ తింటున్న ఇద్దరు 4, 6 సంవత్సరాల ఇద్దరు కొడుకులను వీడియోలో చూపించాడు. ఇది తన చివరి వీడియో అని.. తమ చావుకు కారణం తన భార్యతోపాటు మరో ముగ్గురు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ వీడియో చూసిన బాధితుడి సమీప బంధువుల వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్రాబాద్ సీఐ బీసన్న, అచ్చంపేట ఎస్సై ప్రదీప్, అమ్రాబాద్ ఎస్సై వెంకటయ్య, దోమలపెంట ఎస్సై పోచయ్యతో పాటు ఫారెస్ట్ అధికారులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతని ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఫోన్ సిగ్నల్ఆధారంగా అతడు శ్రీశైలం, దోర్నాల వైపు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హరిశంకర్, అతని కొడుకులను దోర్నాల సమీపంలో క్షేమంగా పట్టుకున్నారు.