పిల్లలు లేరనే మనస్థాపంతో ఆత్మహత్య

పిల్లలు లేరనే మనస్థాపంతో ఆత్మహత్య

రాజేంద్రనగర్,వెలుగు: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ సురేశ్​కథనం ప్రకారం..నెల్లూరుకి చెందిన పి.అరుణ, రాంభూపాల్​రెడ్డి దంపతులు కొన్నేళ్ల క్రితం సిటీకి వచ్చి కిస్మత్​పుర​లో ఉంటున్నారు. అరుణ (35) కు పెళ్లై 12 ఏళ్లయినా సంతానం లేదు.  దీంతో ఆమె సిటీలోని కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. సంతానం కలుగకపోవడంతో మనస్థాపానికి గురైన అరుణ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్ స్పెక్టర్ సురేశ్​తెలిపారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించామన్నారు.

ఇబ్రహీంపట్నంలో

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సింగరేణి కాలనీకి చెందిన ఇందూరి శ్రీనివాస్(47) బోర్ రిపేర్ పని చేసేవాడు. ఇతడికి భార్య సక్కుబాయి, ముగ్గురు కూతుళ్లు,ఇద్దరు కొడుకులున్నారు. ఇబ్రహీంపట్నం బస్టాండ్ ఎదురుగా ఉన్న ఖాదర్ కాంప్లెక్స్ వద్ద శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మొదట గుర్తు తెలియని వ్యక్తి మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో చనిపోయిన వ్యక్తిని శ్రీనివాస్ గా గుర్తించారు. శ్రీనివాస్ కుటుంబసభ్యులకు పోలీసులు విషయం చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో శ్రీనివాస్ సూసైడ్ చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి బంధువుల కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కంచన్ బాగ్ లో

అనారోగ్య సమస్యతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కంచన్ బాగ్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..బాబానగర్ కి చెందిన మహ్మద్ నిస్సార్(48) రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. డయాలిసిస్ ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటున్నాడు. దీని కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిస్సార్ గతంలో ఓ సారి ఆత్మహత్యకు యత్నించాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిస్సార్ సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడి కుమారుడు ఇమ్రాన్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కంచన్ బాగ్ ఎస్సై అనిల్ కుమార్ చెప్పారు.

రాంపల్లిలో..

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కీసర పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్ గౌడ్ కథనం ప్రకారం..కుంచల శ్రావణి(20)కి రామాంజనేయులుతో ఈ ఏడాది మార్చిలో పెళ్లైంది. అత్తమామలు రేణుకమ్మ,వెంకట్ రావు  రామంజనేయులు మరిది ఏడుకొండలు శ్రావణిని అదనపు కట్నం కోసం గత కొంత కాలంగా వేధిస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక గురువారం మధ్యాహ్నం శ్రావణి తన చీరతో బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను నాగారంలోని విజయ హాస్పిటల్ కి  తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. హాస్పిటల్ కి చేరుకున్న శ్రావణి బంధువులు విషయం తెలుసుకుని అత్తమామపై దాడికి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు విషయం తెలుసుకొని అత్తమమలపై వారిపై దాడికి దిగారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రావణి అత్తమామలు భర్త మరిదిని పోలిస్ స్టేషన్ తరలించిన పోలీసులు.శ్రావణి మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పటల్ కు తరలించి కేసునమోదు చేసినట్టు కీసర పోలీసులు తెలిపారు.