బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్

బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్

టాలీవుడ్ లో లవ్ స్టోరీల స్పెషలిస్ట్ దర్శకుడు హను రాఘవపూడి. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, పడి పడి లేచే మనసు, అందాల రాక్షసి లాంటి ప్రేమ కథలను తెరకెక్కించిన హను.. ప్రేక్షకుల, ప్రేమికుల మనసు దోచుకున్నారు. అలాంటి హను రాఘవపూడి మరో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా సీతారామం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అందమైన మిలటరీ ప్రేమ కథగా  రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన స్పెషల్ రోల్ ప్లే చేసింది. ఇప్పటికే రిలీజైన టీజర్, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సుమంత్ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. 

సీతారామంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ నటిస్తున్నాడు. కొన్ని యుద్దాలు మొదలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు..దిస్ ఈజ్ బ్రిగేడియర్ విష్ణు శర్మ.. మద్రాస్ రిజిమెంట్ అంటూ గద్గద స్వరంతో సుమంత్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. 

మరోవైపు సీతారామం మూవీ 1965 బ్యాక్ డ్రాప్లో తెరకెక్కినట్లు టీజర్ను చూస్తే తెలుస్తోంది. సైనికుడిగా ఉన్న రామ్కు ఎవరు లేరని..మాట్లాడటానికి కుటుంబం..కనీసం ఉత్తరం రాయడానికి ఓ పరిచయం కూడా లేదని రెడియోలో ఒక అమ్మాయి చెబుతుంది. రామ్ ఇతర సైనికులతోనే సరదాగా గడుపుతుంటాడని ఆకాశవాణిలో పేర్కొంటోంది. ఇంతలో రామ్కు భారీ సంచిలో లెటర్లు వస్తాయి. అందులో ఓ లెటర్ను చదివిన రామ్..డియర్ రామ్ నీకు ఎవరు లేరా..అబద్దాలు ఎక్కడ నేర్చుకున్నావయ్యా అంటూ ప్రేమగా సీతా మహలక్ష్మి అనే అమ్మాయి లెటర్ రాస్తుంది. అందులో సీతా మహాలక్ష్మి తననుతాను రామ్ భార్యగా చెప్పుకుంటుంది. దీంతో రామ్ ఎవరీ సీతా అంటూ ఆలోచనల్లో పడిపోతాడు. మొత్తంగా సీతారామం.. యుద్ధంలో పుట్టిన ప్రేమకథ అని తెలుస్తోంది.  

సీతారామం సినిమాను అశ్వినీదత్, ప్రియాంగదత్ నిర్మించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం పి.ఎస్ వినోద్ అందిస్తుండగా..విశాల్ సంగీతాన్ని సమకూర్చారు.  తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీని  ఆగస్ట్ 5న విడుదల చేయనున్నారు.