
ఖమ్మం : ఎండ వేడికి జనం గగ్గోలు పెడుతున్నారు. భూగర్భ జలాలు ఎండిపోయి ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ లో నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు నెలల నుంచి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ఎండలకు తోడు… భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతుండటంతో ప్రజలు నీటి కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి.
కొన్ని చోట్ల మిషన్ భగీరథ నీరు ప్రజలకు అందుబాటులోకి వచ్చినా.. అది పూర్తి అవసరాలు తీర్చేందుకు చాలట్లేదు. జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నెల రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, అధికారులు పట్టించుకోవట్లేదని సీరియస్ అవుతున్నారు. పంటలకు నీళ్లు సరిపోక చేతికి వచ్చిన పంటచేను ఎండిపోతుందని చెబుతున్నారు అన్నదాతలు. బోర్లు ఆగి పోస్తున్నాయని..బావులు పూర్తిగా ఎండిపోయాయని తెలిపారు.