ఎండాకాలంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండాకాలంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. మొన్నా మధ్య రెండు రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ సూర్యుడు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది వడదెబ్బకి పిట్టల్లా రాలుతున్నారు జనం. కొంతమంది వాంతులు, విరోచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు డాక్టర్లు. రోజుకు 7-8 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీరసంగా అనిపిస్తే.. కొబ్బరి నీరు, నిమ్మకాయ నీళ్లు, పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు తాగితే వెంటనే ఉపసమనం లభిస్తుంది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్, తలకు క్యాప్‌ ధరించాలి. రోజు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావా తదితర తీసుకోవాలి.

సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే బయట పనులు చేసుకోండి. బయటకు వెళ్లినప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తాగాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉక్కపోతకు శరీరంపై చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిని గిల్లడం వల్ల ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. జీన్స్‌ లాంటి దుస్తులు కాకుండా తెల్లని కాటన్ వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది. చెమట పొక్కుల సమస్య ఉండదు. రోజు రెండుసార్లు స్నానం చేయాలి. తోలుతో చేసిన చెప్పులు వేసుకోవాలి. బిర్యానీలు, మాంసాహారం, శరీరానికి వేడి చేసే మసాల దినుసులు, కారం ఎక్కువగా ఉండే పచ్చళ్ళు, వేపుడు పదార్ధాలు తినకూడదు. నూనే తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది.

అన్నం తిన్నాక చివరలో తప్పక మజ్జిగ అన్నం తినాలి. ఎక్కువ వేడి చేసిన వారు రోజు మూడు టీ స్పూన్‌ల సబ్జా గింజలను నానబెట్టుకుని తినాలి. లేదా గాజు గ్లాసులో మూడు వంతుల నీళ్ళను పోసి అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచం ఖండ శక్కర (మిశ్రి ) వేసి ఉదయం నానబెట్టి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆ నీటిని క్రమం తప్పకుండా త్రాగితే మంచి ఫలితాలు వస్తాయి. శరీరంలో ఉన్న అధిక వేడిని ఇది నివారిస్తుంది. ఉదయాన్నే కలబంద గుజ్జును సన్నగా తరుగుకుని తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది.