వెలుగు ఓపెన్ పేజీ.. అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం

వెలుగు ఓపెన్ పేజీ.. అగ్నిప్రమాదాలపై  అప్రమత్తత అవసరం

రాష్ట్రంలో  గత  నాలుగు,  ఐదు రోజులుగా  జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.  ప్రస్తుతం  వేసవికాలం గనుక  అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా  రైతులు  వరి పంటలు  లేదా ఇతర పంటల వ్యర్థాలను పొలాల్లోనే అంటించడం వల్ల  అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.  రైతులు పంట వ్యర్థాలను పొలంలోనే కాల్చడం వల్ల  నష్టమే తప్ప లాభం లేదు.  అగ్నికి నేల సారవంతాన్ని కోల్పోయి,  తదుపరి  పంట దిగుబడి తగ్గిపోతుంది. దీని ఫలితంగా రైతులు మళ్లీ ఎక్కువ మొత్తంలో  ఎరువులు  వేయాల్సి వస్తుంది.  ఈ అదనపు ఖర్చు రైతే భరించాలి.  కాబట్టి పంట వ్యర్థాలను కాల్చకుండా రోటావేటర్  సహాయంతో  నేలలోనే కలిపి  కుళ్ళించడం ద్వారా నేల సారవంతం పెరిగి, తదుపరి పంటల దిగుబడి పుష్కలంగా  పెరుగుతుంది.   

వేసవికాలంలో  కరెంటు తీగలు కారణంగా  ప్రమాదాలు పెరగడం సహజం. గ్రామాల్లో పొలాల్లోనే  కరెంటు స్తంభాలు ఉండటంతో  తీగలు పంటలపై  వేలాడే అవకాశం ఉంటుంది.  ఆ సమయంలో గాలి వేగంతో రాపిడి జరిగి పంటలకు మంటలు అంటుకునే ప్రమాదం ఉంది.    పరిశ్రమలలో కెమికల్స్, ఇంధనం వంటి పదార్థాలు ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల  వేసవిలో వేడి,  స్పార్క్ కలిస్తే  పెద్ద ప్రమాదాలు  జరుగుతాయి. కాబట్టి యాజమాన్యాలు  ఫైర్ సేఫ్టీ  చర్యలను  పకడ్బందీగా అమలు చేయాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు.  

వేసవి గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా ఇళ్లలో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిజ్‌‌‌‌ల వాడకం పెరుగుతుంది. దీనివల్ల అధిక వోల్టేజ్ కారణంగా షార్ట్ సర్క్యూట్లు జరిగి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఇది  ప్రాణనష్టం, ఆస్తి నష్టాలకు దారి తీస్తుంది.  రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.  ప్రతి జిల్లాలో సరిపడా ఫైర్ ఇంజిన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. 
 

- హరీష్ సాగర్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.