
వెలుగు నెట్‌వర్క్: వడగాడ్పులు రాష్ట్రంలో మరో 11 మందిని బలితీసుకున్నాయి. ఓటేయడానికి వస్తూ కొందరు, ఎండల్లోనూ పనికి వెళ్లి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఎండాకాలం మొదలైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో వడదెబ్బకు లోనై మరణించారు. నల్గొండలో 19 మంది, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెంలలో 12 మంది చొప్పున, సూర్యాపేటలో 11, మహబూబాబాద్, నిర్మల్‌లలో 8 మంది చొప్పున, కామారెడ్డి 6, ఆసిఫాబాద్ 5, మంచిర్యాల 4, సిరిసిల్ల, జనగాం, యాదాద్రిల్లో ముగ్గురి చొప్పున, వరంగల్ రూరల్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఇద్దరి చొప్పున, జగిత్యాల, మెదక్, వనపర్తిల్లో ఒక్కొక్కరు చనిపోయారు.
ఓటేయడానికి వెళ్తూ..
భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురానికి చెందిన కుసుమ ఆంజనేయులు (70) మహారాష్ట్రలోని భీవండికి వలస వెళ్లాడు. ఓటేయడానికి స్వగ్రామం వచ్చాడు. శుక్రవారం ఓటేయడానికి వెళ్తూ ఎండదెబ్బకు కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రాణాలు వదిలాడు. ఇదే మండలం నమిలె గ్రామానికి చెందిన కిష్టయ్య (58) ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి బైక్‌పై వస్తూ వడదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయాడు. సిద్ధిపేట జిల్లా నారాయణరావు పేటలో గ్యాదపాక నర్సవ్వ (74) పింఛన్ డబ్బుల కోసం ఎండలో నడుచుకుంటూ వెళుతూ కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తీసుకెళుతుండగా కన్నుమూసింది.
ఇదే జిల్లా పుల్లూర్‌లో కర్రె నర్సయ్య (80) అనే కూలీ వడదెబ్బతో చనిపోయాడు. నల్లగొండ జిల్లా బాడవతండాలో మాలోతు నాగులు(60), నల్లగొండలోని అర్జాల బావిలో ఉండే పెరికె భిక్ష్మమమ్మ (55), తిరుమలగిరి మండలం పిల్లిగుండ్ల తండాలో జటావత్ సాయికుమార్ (21) అనే వికలాంగ యువకుడు, కొండమల్లేపల్లి బీసీ కాలనీలో ఉండే ఇడుకుళ్ల వెంకటేశ్వర్లు (64), కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాసనగర్‌కు చెందిన తాట్లెంక కనకయ్య (55), తిమ్మాపూర్ మండలంలోని రేణికుంటకు చెందిన కనుకుంట్ల మల్లేశం (48), హుజూరాబాద్ మండలం తోకలపల్లికి చెందిన వ్యవసాయ కూలి కందిరే ఆగమ్మ (50) వడదెబ్బకు బలయ్యారు.