
వీకెండ్కు ఎక్కడికెళ్లాలని ఆలోచిస్తున్నారా? వేసవి కదా ఏదైనా చల్లని ప్లేస్ కు వెళ్తే బాగుంటుంది. చల్లని ప్రదేశాలనగానే ఊటీ, కొడైకెనాల్, మున్నార్ అంటుంటారు చాలామంది. కానీ అంత దూరం వెళ్లకుండా మన తెలంగాణలోనే ఇంకో ఊటీ ఉంది తెలుసా? అదే మెదక్ జిల్లాలోని గొట్టంగుట్ట. దీన్ని తెలంగాణ ఊటీ అని కూడా అంటారు.
హైదరాబాద్ నుంచి కేవలం 130 కిలోమీటర్ల దూరం ఉండే గొట్టంగుట్ట గురించి చాలామందికి తెలియదు. వేసవిలో చల్లని ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్లాలనుకునే వాళ్లు అక్కడికి వెళ్తే చాలు అన్నీ మర్చిపోయి.. ప్రకృతి ఒడిలో సేదతీరడం ఖాయం. ఇక్కడ ఎటు చూసినా పచ్చని అందాలే కనిపిస్తాయి. మనసును కట్టిపడేసే ప్రకృతి సోయగాలు కనువిందు చేస్తాయి. చుట్టూ పచ్చని మైదానాలు, కొండలు, ఆ కొండలపై నుంచి జాలువారే జలపాతాలు ఇలాంటివెన్నో మనసును ఆహ్లాదపరుస్తాయి. అడవి మధ్యలో నుంచి సాగే ప్రయాణం అడుగడుగునా మధురానుభూతుల్ని మిగులుస్తుంది.
అటవీ అందాలు
గొట్టంగుట్ట కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. ఈ ప్రదేశం ప్రకృతి సోయగాలకు నిలయం. గొట్టంగుట్ట చేరుకోవడానికి అడవుల నుంచి ప్రయాణించాలి. జర్నీలో భాగంగా... జహీరాబాద్ నుంచి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించగానే అద్భుతమైన అందాలు ఆహ్వానం పలుకుతాయి. ఎటుచూసినా ప్రకృతి రమణీయత తప్ప మరో ప్రపంచం కనిపించదు. చుట్టూ పచ్చటి మైదానాలు, చెట్లు వాటి మధ్యలో మట్టిరోడ్డు జర్నీ, ఇదో చిన్నపాటి సాహసయాత్రలా ఉంటుంది. సువిశాలమైన అటవీ ప్రాంతం.... కొండల మధ్యలో నుంచి ప్రవహించే పెద్ద వాగు, చిన్న చిన్న జలపాతాలు, ఒక్కసారి వెళ్లే ఆ జర్నీని ఎప్పటికీ మర్చిపోలేం.
ఆధ్యాత్మికం కూడా..
ఇది పర్యాటకంతో పాటు ఆధ్యాత్మికంగాను ప్రసిద్ధి. ఇక్కడ కొన్ని పురాతనమైన దేవాలయాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. మార్గమధ్యంలో చించోలి అభయారణ్యంతో పాటు చిన్న చిన్న దేవాలయాలు, శివాలయం, విఘ్నేశ్వరాలయం, భవాని మాత గుడి కనిపిస్తాయి. అలా అన్నీ దాటుకుంటూ ముందుకెళ్తే.. వంపులు తిరుగుతూ పరవళ్లు తొక్కే నదీ జలాలు దర్శనమిస్తాయి.
ఆప్రకృతి దృశ్యాలు ఊటీ, కొడైకెనాలు ఏమాత్రం తీసిపోవు. ఇక్కడ ఉన్న శ్రీ గురు గంగాధర బక్క ప్రభు దేవస్థానంలో ప్రతి శ్రావణమాసం ప్రత్యేక పూజలు, జాతర నిర్వహిస్తారు. తెలంగాణ నుంచే కాదు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. పెద్ద అడవి. ...అడవిలో దేవాలయాలు ఉండడంతో దీన్ని 'రెండో శ్రీశైలం' గా అక్కడి వాళ్లు పిలుచుకుంటారు.
సహజ అందాలు
అక్కడి నుంచి ఓ పది కిలోమీటర్లు ప్రయాణిస్తే.. మల్కాపూర్ జలపాతం. ఉంటుంది. గొట్టంగుట్ట వచ్చిన వాళ్లు ఇక్కడికి కూడా తప్పక వస్తారు. ఈ జలపాతం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతంలో కూడా లోతైన లోయలు, ఎత్తైన కొండలు, వాటి మధ్యలో కొండల నుంచి జలజలా పారే సెలయేరు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
ప్రతి శని, ఆదివారాలు పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి దగ్గర్లో చంద్రగిరి డ్యామ్ కూడా ఉంది. వీకెండ్ ట్రిప్ కు దగ్గర్లో ఎక్కడికైనా వెళ్లాలంటే గొట్టంగుట్ట బెస్ట్ డెస్టినేషన్. రెండు, మూడు రోజుల్లో వెళ్లి తిరిగి రావొచ్చు. రోజూ బిజీ లైఫ్ లో ఒత్తిడిగా ఫీలయ్యేవాళ్లు ఇక్కడకు ఒక్కసారి వెళితే చాలు తమను మరచిపోతారు. అద్భుతమైన అనుభూతులు సొంతం చేసుకుంటారు.
ఇక్కడి ప్రాంతంలో సినిమా షూటింగులు కూడా జరుగుతుంటాయి. ఇది కర్ణాటక తెలంగాణ సరిహద్దు కావడంతో అక్కడి ప్రజల భాష, లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇది టూరిస్ట్ స్పాట్ గా అంతగా ప్రాచుర్యం పొందకపోయినా... నేచురల్ బ్యూటీకి మాత్రం పెట్టింది పేరు.
హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?
గొట్టంగుట్ట వెళ్లాలనుకునే వాళ్లు ముందు జహీరాబాద్ వెళ్లాలి. జహీరాబాద్ నుంచి గొట్టంగుట్ట 30 కి.మీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే 130 కి.మీ. ఉంటుంది. కానీ గొట్టంగుట్టలో ఉండటానికి వసతి సౌకర్యం లేదు. దగ్గర్లోని జహీరాబాద్ లో బస చేయాలి. అక్కడి నుంచి గొట్టంగుట్ట వెళ్లి ఒక్కరోజులోనే రిటన్ కావొచ్చు..
–వెలుగు,లైఫ్–