
ప్రపంచంలో అగ్రదేశాలైన అమెరికా-రష్యా ఎట్టకేలకు చర్చలకు సిద్ధమయ్యాయి. ఆగస్టు 15న పుతిన్ తో చర్చలు చేపట్టనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ఇరు దేశాలు చర్చలు జరపనున్నట్లు ప్రకటించారు. వచ్చే వారం పుతిన్ అలస్కా రాష్ట్రాన్ని సందర్శిస్తారని.. అక్కడ చర్చలు జరపుతామని ట్రంప్ పోస్ట్ చేశారు.
ప్రపంచంలోనే అగ్రదేశాలైన అమెరికా-రష్యా చర్చలపై ఆసక్తి నెలకొంది. 2015 తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా రావడం ఇది తొలిసారి. అప్పట్లో బరాక్ ఒబామాను కలిసిన పుతిన్ మళ్లీ రాలేదు. అదేవిధంగా 2021 తర్వాత యూఎస్-రష్యా కు సంబంధించి మొదటి సమావేశం కావడం గమనార్హం. అంతకు ముందు జో బైడెన్ పుతిన్ తో జెనీవాలో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చలు జరగనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. రష్యా ఉక్రియెన్ ప్రాదేశిక సరిహద్దుల వివాదాల అంశంలో ఇరు దేశాలకు మేలు కలిగించేలా చర్చలు జరుపుతామని తెలిపారు ట్రంప్.
అయితే ఈ ఇద్దరు అగ్రనేతల భేటీని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ తప్పుబట్టారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సరిహద్దుకు సంబంధించి ఉక్రెయిన్ రాజ్యాంగంలో ఉందని.. దీన్ని ఎవరూ మార్చలేరని అన్నారు. అయినా తాము లేకుండా చర్చలు జరపటం ఏంటని మండిపడ్డారు.
ఈ చర్చలతో యుద్ధం ఆగుతుందని భావిస్తున్నాం: భారత్
అమెరికా-రష్యా భేటీపై ఇండియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాధ్యక్షుల భేటీని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ భేటీ ఉక్రెయిన్ లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెడుతుందని భావిస్తు్న్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు.. ఇది యుద్ధాల శకం కాదని చెప్పినట్లు.. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపన దిశగా చర్చలు జరగాలని ఆశిస్తున్నట్లు ఇండియా పేర్కొంది.