రహస్య పత్రాల కేసులో.. ట్రంప్​కు సమన్లు

రహస్య పత్రాల కేసులో.. ట్రంప్​కు సమన్లు
  • ఈ నెల 13న కోర్టుకు రావాలంటూ ఆదేశం
  • నోటీసులు జారీ చేసిన ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ
  • ఆరోపణలు రుజువైతే ట్రంప్ జైలుకెళ్లే చాన్స్

మయామి(అమెరికా): రహస్య పత్రాల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు నమోదు చేసింది. జూన్ 13 మయామిలోని ఫెడరల్‌‌ కోర్టు హౌస్‌‌లో హాజరు కావాలని సమన్లు పంపింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా శుక్రవారం వెల్లడించారు. అమెరికా చరిత్రలోనే ఓ సిట్టింగ్‌‌ లేదా మాజీ అధ్యక్షుడిపై ఇలా ఫెడరల్ అభియోగాలు నమోదవ్వడం ఇదే తొలిసారి. అయితే, ఈ విషయంపై యూఎస్ జస్టిస్ డిపార్ట్​మెంట్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఫెడరల్ జ్యూరీ ఆరోపణలు కోర్టులో రుజువైతే ట్రంప్ జైలుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు, 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకీ దూరమయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఏడు క్రిమినల్​ కౌంట్స్​తో ఆరోపణలు

దేశ రక్షణకు సంబంధించిన రహస్య పత్రాలు ఉద్దేశపూర్వకంగా తనవద్దే ఉంచుకోవడం, తప్పుడు ప్రకటనలు చేయడం, న్యాయ ప్రక్రియను అడ్డుకోవడం, కుట్ర వంటి అభియోగాలు డొనాల్డ్ ట్రంప్​పై నమోదైనట్లు ఆయన తరఫు అడ్వకేట్ జేమ్స్ ట్రస్టీ వెల్లడించారు. ఏడు క్రిమినల్‌‌ కౌంట్స్‌‌తో ట్రంప్‌‌పై ఈ అభియోగాలు నమోదైనట్లు యూఎస్ జస్టిస్ డిపార్ట్​మెంట్​కు చెందిన ఒకతను తెలిపాడు.

నేను అమాయకుడిని: డొనాల్డ్ ట్రంప్

తాను అమాయకుడినని, ఏ తప్పూ చేయలేదని తన సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ వీడియో పోస్టు చేశారు. 13వ తేదీన మయామిలోని ఫెడరల్ కోర్టు హౌస్​లో హాజరుకావాల్సి ఉందన్నారు. ఓ మాజీ అధ్యక్షుడికి ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. తప్పుడు కేసులు బనాయించి తనను అధ్యక్ష పదవి రేసులో నుంచి తప్పించాలని కుట్ర పన్నారని ట్రంప్ ఆరోపించారు. ఈ కుట్రలో అవినీతితో నిండిపోయిన బైడెన్ సర్కారు హస్తం ఉందని విమర్శించారు.

రహస్య పత్రాల కేసు ఏంటి?

వైట్​హౌస్​ను ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాలను కూడా తీసుకెళ్లారని ట్రంప్​ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్​ ప్రకారం.. వైట్​హౌస్ పేపర్లు ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తారు. వాటిని తప్పనిసరిగా భద్రపర్చాలి. నేషనల్ ఆర్కైవ్స్‌‌ అధికారులు 2022 జనవరిలో ట్రంప్ ఎస్టేట్​లో సోదాలు చేసి మొత్తంగా క్లాసిఫైడ్ మార్కింగ్ ఉన్న 300 పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ కేసు నమోదు చేసింది.