
ఎలా వండుకున్నా టేస్టీగా ఉండే మాంసాహార వంటల్లో చికెన్ ఫస్ట్ ప్లేస్, చికెన్ ప్రేమికులైతే.. చికెన్ ఎలా వండినా.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. అందుకే.. మీకోసం ఈ వారం చికెన్ వెరైటీలు తెచ్చినం. ఏందీ.. నోట్లో నీళ్లూరుతున్నాయా? ఇంకా లేటెందుకు వంట మొదలుపెట్టేయండి మరి!
కావాల్సినవి
చికెన్: అరకిలో,
ఉల్లిగడ్డలు : 2
నూనె : 4 స్పూన్లు,
పచ్చికొబ్బరి : ఒక ముక్క
పచ్చిమిర్చి : నాలుగు,
గసగసాలు: రెండు స్పూన్లు
ఉప్పు : తగినంత,
కారం : రెండు స్పూన్లు
పసుపు : చిటికెడు,
పెరుగు : ఒక కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్ : ఒక స్పూన్,
గరంమసాలా : ఒక స్పూన్
ఇలా చేయాలి:
ముందుగా చికెన్ కడిగి, ఒక గిన్నెలో వేసి అల్లంవెల్లుల్లి, కారం, ఉప్పు, పెరుగు, గరంమసాలా, పసుపు, కాస్త నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టాలి. పొయ్యి మీద కడాయి పెట్టి గసగసాలు వేగించాలి. పచ్చిమిర్చి, కొబ్బరి, గసగసాలు గ్రైండ్ చేయాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిగడ్డ ముక్కలను దోరగా వేగించాలి. అందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి, గసగసాల పేస్టు కలిపి ఐదు నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత చికెన్ వేసి బాగా కలిపి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. కాస్త మగ్గాక తర్వాత రెండుగ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి పదినిమిషాలు ఉంచాలి. రుచి చూసి.. కావాలనుకుంటే మరింత కారం, ఉప్పు వేసి ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఉంచితే.. నోరూరించే చికెన్ ఇగురు రెడీ.