ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో ఆగిన సన్‌ఫ్లవర్ దిగుమతులు

ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో ఆగిన సన్‌ఫ్లవర్ దిగుమతులు

 

  • ఇదే అదనుగా స్టాక్‌ బ్లాక్ చేసి రేట్లు పెంచిన వ్యాపారులు
  •  కలెక్టర్లు రంగంలోకి దిగినా కంట్రోల్‌లోకి వస్తలే  
  •  సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్‌‌ రూ.180 నుంచి రూ.220  
  •  ఎక్కడ చూసినా ‘నో స్టాక్’​బోర్డులే

మహబూబ్‌నగర్, వెలుగు: వంట నూనెల ధరలు మండిపోతున్నయ్. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం వల్ల సన్‌ఫ్లవర్ దిగుమతులు ఆగిపోవడం, స్థానికంగా హోల్​సేల్ వ్యాపారులు స్టాక్‌ను బ్లాక్​ చేస్తుండడంతో రేట్లు అమాంతం పెరిగాయి. సన్​ఫ్లవర్, పామాయిల్ రేట్లయితే ఆల్​టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పది రోజుల కిందటి దాకా లీటర్ సన్​ఫ్లవర్ ఆయిల్‌ను రిటైల్ మార్కెట్‌లో రూ.135 నుంచి రూ.140కి అమ్మగా, ప్రస్తుతం రూ.180 నుంచి రూ.220 దాకా అమ్ముతున్నారు. పామాయిల్, పల్లి నూనె కూడా రూ.170 నుంచి రూ.190 దాకా విక్రయిస్తున్నారు. ఆ రేట్లకైనా కొందామని వెళ్లే వినియోగదారులకు మార్కెట్​లో ఆయిల్ దొరకడం లేదు. హైదరాబాద్​సహా అన్ని జిల్లాల్లోని మాల్స్, స్టోర్లలో విజయ, ఫ్రీడమ్, ఫార్చ్యూన్, గోల్డ్​డ్రాప్ వంటి బ్రాండ్లు కనిపించడం లేదు. ఫ్లిప్​కార్ట్, అమెజాన్ లాంటి ఆన్​లైన్ ప్లాట్‌ఫామ్స్​లోనూ మెజారిటీ బ్రాండ్ల సన్​ఫ్లవర్ ఆయిల్స్ ‘నాట్​అవెయిలబుల్’ అని చూపిస్తున్నాయి. బిగ్​బాస్కెట్​లాంటి చోట్ల లీటర్‌‌కు రూ.215 చొప్పున అమ్ముతున్నారు.

ఎంఆర్పీలోనే మతలబు

మన దేశంలో వినియోగిస్తున్న సన్​ఫ్లవర్ ఆయిల్​లో 70 శాతం ఉక్రెయిన్ నుంచే దిగుమతి అవుతోంది. మరో 25 శాతం ఆస్ర్టేలియా, రష్యా లాంటి దేశాల నుంచి వస్తుండగా, మన దగ్గర 5 శాతం లోపే ఉత్పత్తి అవుతున్నది. యుద్ధం వల్ల ఉక్రెయిన్, రష్యాల నుంచి రెండువారాలుగా సన్​ఫ్లవర్​ఆయిల్ దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో వారం, పదిరోజులుగా ఆయిల్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం లీటర్‌‌పై రూ.35 నుంచి రూ.80 దాకా పెంచి అమ్ముతున్నారు. కరోనా టైంలో వంట నూనెల రేట్లు కొన్ని నెలలపాటు పెరిగినా తర్వాత తగ్గాయి. ఫస్ట్ వేవ్ మొదలైన 2020 మార్చిలో సన్​ఫ్లవర్ ఆయిల్ లీటరు ఎమ్మార్పీ రూ.110 ఉండగా, హోల్​సేల్​రేటు రూ.90 ఉండేది. 2021 ఏప్రిల్ నాటికి హోల్​సేల్‌లో రూ.165కు, ఎమ్మార్పీ రూ.175 చేరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నూనెలపై ఉన్న ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. 2021 సెప్టెంబర్ నుంచి రేట్లు తగ్గుతూ వచ్చాయి. యుద్ధం ముందు దాకా సన్ ఫ్లవర్ ఆయిల్ రేట్లు రూ.135 నుంచి 150 మధ్య, పామాయిల్ రేట్లు రూ.135– 140 మధ్య ఉన్నాయి. కానీ ఇప్పుడు యుద్ధం సాకుతో వంట నూనెల రేట్లు పీక్స్​కు చేరాయి. ఎంఆర్పీలో ఉన్న మతలబు వ్యాపారులకు బాగా కలిసివస్తోంది. ఉదాహరణకు వినియోగదారుడికి లీటర్​రూ.140కి అమ్మినప్పుడు కూడా హోల్​సేల్, రిటైల్​వ్యాపారులకు ఒక్కో లీటర్​పై రూ.20 నుంచి రూ.30 వరకు మిగిలేది. డిస్ట్రిబ్యూటర్లు ఈ ధరకు 20 నుంచి 25 శాతం తక్కువకు అంటే రూ.105 నుంచి రూ.110 కే సప్లై చేయడమే ఇందుకు కారణం. కానీ అప్పుడు కూడా చాలా బ్రాండ్లకు చెందిన లీటర్ ఆయిల్​ప్యాకెట్లు, బాటిల్స్​పై దగ్గరదగ్గర రూ.180 నుంచి రూ.215 దాకా ముద్రించారు. దీంతో ప్రస్తుతం ఎంఆర్పీకే విక్రయిస్తున్నామని చెబుతుండడంతో ఆఫీసర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. నిజానికి యుద్ధం కంటే ముందు హోల్​సేల్ వ్యాపారులు రెగ్యులర్ స్టాక్​కన్నా నాలుగు రెట్ల స్టాక్‌ను డిస్ర్టిబ్యూటర్ల నుంచి దిగుమతి చేసుకున్నట్లు ఆఫీసర్లు అంటున్నారు. ఆ స్టాక్​ను మామూలు రేట్లకు అమ్మాల్సి ఉండగా, భారీ ధరలకు అమ్ముతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని చెబుతున్నారు.

కలెక్టర్లు హెచ్చరించినా అంతే..

వంట నూనెలను బ్లాక్ చేస్తున్నారనే సమాచారంతో జిల్లాల్లో కలెక్టర్లు రంగంలోకి దిగి వ్యాపారులతో మీటింగులు పెడ్తున్నారు. రూల్స్​ను అతిక్రమించిన వాళ్లపై నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 8న కరీంనగర్‌‌లో అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్.. వంటనూనెల హోల్ సేల్, రిటైల్ అమ్మకందారులు, డిస్ట్రిబ్యూటర్లతో మీటింగ్ నిర్వహించారు. వంట నూనెలను పరిమితికి మించి నిల్వ ఉంచినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా, ఎంఆర్పీకి మించి విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ జిల్లాలో వారం, పదిరోజుల ముందు సన్​ఫ్లవర్​ఆయిల్ రేటు లీటర్‌‌కు రూ. 136 నుంచి 140 వరకు ఉండగా, ఆదివారం రూ.180కి తక్కువ అమ్మలేదు.

రేట్లు ఇంకా పెరుగుతయా?

రాష్ట్ర వ్యాప్తంగా మాల్స్, స్టోర్స్, సూపర్​మార్కెట్లలో ఇప్పటికే ‘ఆయిల్ నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్​కార్ట్, బిగ్​బాస్కెట్, డీమార్ట్ లాంటి సంస్థల్లోనూ మెజారిటీ బ్రాండ్ల సన్​ఫ్లవర్​ఆయిల్స్ దొరకట్లేదు. నిజానికి మన రాష్ట్రంలో అన్ని రకాల నూనెలు కలిపి రోజూ 2,500 టన్నుల దాకా వినియోగిస్తున్నారు. ఇందులో 1,500 టన్నుల (60 శాతం) దాకా సన్ ఫ్లవర్ ఆయిలే. పామాయిల్, పల్లి, సోయా, రైస్‌ బ్రాన్‌ తదితర నూనెల వాటా 40 శాతమే. అందువల్లే సన్​ఫ్లవర్ ఆయిల్​షార్టేజ్​ ను చూపి వ్యాపారులు మిగిలిన నూనెల రేట్లు పెంచేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు. వార్​ ఆగిన వెంటనే నూనె దిగుమతులు మొదలయ్యే చాన్స్ లేదు. ఈ లెక్కన రేట్లు మరింత పెరిగే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే రూ.40 పెంచిన్రు

రెండు వారాల కింద మూడు ప్యాకెట్ల నూనె కొంటే రూ.160 చొప్పున తీసుకున్నరు. ఇప్పుడేమో ఒక్కో ప్యాకెట్‌కు రూ.200 చెబుతున్నరు. పని మీద పాలమూరు వచ్చిన. ఇక్కడన్న రేట్లు తక్కువ ఉంటయేమోనని మార్కెట్‌కు వస్తే.. ఇక్కడా గవే రేట్లే. ఇగో మూడు లీటర్ల సీసా రూ.590కి ఇచ్చిన్రు. చేసేది లేక కొంటపోతున్న.
- మాధవి, ఇబ్రహీంనగర్, మహబూబ్​నగర్ జిల్లా

ఎట్ల బతకాలె

మాది నిరుపేద కుటుంబం. నా భర్త, నేను పని చేస్తేనే ఇల్లు గడుస్తది. ఈ మధ్య నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరుగుతున్నయి. నూనె రేట్లకైతే పట్టపగ్గాలు లెవ్వు. లీటర్ ఇప్పుడు 200 అంటున్నరు. రోజురోజుకు పెరుగుతున్న రేట్లతో ఎట్ల బతకాలెనో అని భయమైతంది. 
- మోర రమాదేవి, మడికొండ, హనుమకొండ జిల్లా